Income Tax: ఈ-రిటర్నుల ధ్రువీకరణకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం

  • 2015-2016 నుంచి 2019-2020 మదింపు సంవత్సరాల ఈ-ఫైలింగ్‌కు అవకాశం
  • పెండింగ్‌లో ఉన్న సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌కు వచ్చిన పత్రాలు
  • ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న అధికారులు
  • సకాలంలో ఐటీఆర్‌-వీలను సమర్పించాలన్న అధికారులు
Tax department allows verification of past income tax returns by September

2015-2016 మదింపు సంవత్సరం నుంచి 2019-2020 మదింపు సంవత్సరం వరకు ఈ-ఫైలింగ్‌ రిటర్న్‌ల వెరిఫికేషన్ల‌కు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు అవకాశం కల్పించారు. ఇప్పటికే 2015-16, 2016-17, 2017-18, 2019-20 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఈ-ఫైలింగ్‌ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను వెరిఫికేషన్‌ చేసుకోని వారికి ఐటీ శాఖ ఈ అవకాశం ఇచ్చింది.

బెంగళూరులోని సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌కు ధ్రువీకరణ అనుమతి‌ కోసం వచ్చిన ఈ-ఫైలింగ్‌ రిటర్న్‌లు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సకాలంలో ఐటీఆర్‌-వీలను సమర్పించాలని, లేదంటే ఐటీఆర్‌లను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు.

పన్ను చెల్లింపుదారులు డిజిటల్‌ సంతకం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే ఆన్‌లైన్‌లోనే ఆధార్‌ ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లేదంటే నెట్‌ బ్యాంకింగ్ ద్వారా,‌ బెంగళూరులోని సీపీసీకి సంతకం చేసిన ఐటీఆర్‌-వీ పత్రాలను పంపడం ద్వారా వెరిఫికేషన్‌ చేసుకోవచ్చు.

ఐటీఆర్‌లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన 120 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. బెంగళూరులోని సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌కు ధ్రువీకరణ అనుమతి‌ కోసం వచ్చిన ఈ-ఫైలింగ్‌లో జాప్యం నెలకొనడంతో అధికారులు  ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు ధ్రువీకరణ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు.

More Telugu News