ధోనీ, నేను చిన్న రూమ్ లో కింద పడుకుని నిద్రపోయాం: గౌతమ్ గంభీర్

13-07-2020 Mon 10:01
  • ధోనీ అదృష్టవంతుడైన కెప్టెన్
  • అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ఆటగాళ్లు లభించారు
  • రూమ్ లో మంచాలు తీసేసి బెడ్లు నేలపై వేసుకున్నాం
  • ధోనీ పొడవైన కేశాల గురించే మాట్లాడుకునేవాళ్లం
  • జింబాబ్వే పర్యటనను గుర్తు చేసుకున్న గంభీర్
Gambhir Intresting Comments on Dhoni

ఆధునిక క్రికెట్ ప్రపంచంలో మహేంద్ర సింగ్ ధోనీ, ఓ స్టార్ క్రికెటర్ గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆటలో ఎంత టెన్షన్ ఉన్నా, తాను మాత్రం కూల్ గా ఉంటూ జట్టును విజయతీరాలకు చేర్చడంలో ఎన్నోసార్లు తన సత్తా ఏంటో చూపించాడు. స్టంప్స్ వెనుక ఉండి, ఆటను గమనిస్తూ, ప్రత్యర్థి బ్యాట్స్ మన్ కదలికలపై కన్నేసి, కుల్ దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ వంటి బౌలర్లకు సలహాలు, సూచనలు ఇస్తూ, వికెట్లను సాధించడంలో తనకు తానే సాటి అని అనిపించుకున్నాడు.

తాజాగా స్టార్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న ఓ క్రికెట్ షోలో పాల్గొన్న మాజీ క్రికెటర్, ప్రస్తుత ఎంపీ గౌతమ్ గంభీర్, ధోనీతో తాను రూమ్ ను షేర్ చేసుకున్న పాత సంగతులు గుర్తు చేసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మేమిద్దరమూ దాదాపు నెల రోజులకు పైగా ఒకే రూములో ఉన్నాము. ఆ సమయంలో మా మధ్య అధికంగా వచ్చే చర్చ అతని పొడవైన కేశాల గురించే. అంత పొడవైన వెంట్రుకలను ఎలా మెయిన్ టెయిన్ చేస్తావని ఎన్నోసార్లు అడిగాను. అప్పట్లో మాకు ఇచ్చిన రూమ్ చాలా చిన్నదిగా ఉండేది. దాన్ని విశాలంగా ఎలా చేయాలని ఆలోచించి, రెండు మంచాలూ తీసి, బెడ్లను నేలపై వేసుకుని, నేలపైనే నిద్రించేవాళ్లం. దీంతో రూమ్ కాస్తంత స్పేషియస్ గా ఉండేది. అదో మరపురాని అనుభూతి" అని అన్నారు.

ధోనీ అప్పుడప్పుడే క్రికెట్ లోకి ప్రవేశించాడని, ఆ సమయంలో జింబాబ్వేతో టూర్ కు తాము ఇండియా 'ఏ' తరఫున వెళ్లామని గుర్తు చేసుకున్న గంభీర్, కెన్యాలో ఒకే గదిలో ఇద్దరమూ ఉండటం వల్ల ధోనీ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకున్నానని అన్నారు. "ధోనీ ఎంతో అదృష్టవంతుడైన కెప్టెన్ అని చెప్పగలను. అన్ని రకాల ఫార్మాట్లలో మంచి ఆటగాళ్లు ధోనీకి దొరికారు. అందువల్లే 2011 వరల్డ్ కప్ లో విజయం సాధించడం ధోనీకి సులువైంది. సచిన్, సెహ్వాగ్, నేను, యువరాజ్, యూసుఫ్, విరాట్ వంటి ఆటగాళ్లతో కూడిన ఉత్తమ టీమ్ ధోనీ సారథ్యంలో కప్ ను గెలుచుకుంది" అని అన్నారు.