DMK MLA: చెంగల్పట్టు జిల్లాలో రెండు వర్గాల ఘర్షణ.. తుపాకితో కాల్పులు జరిపిన డీఎంకే ఎమ్మెల్యే.. అరెస్ట్!

  • రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేస్తుండగా అడ్డుకున్న గ్రామస్థులు
  • 50 మంది కిరాయి మూకలతో వచ్చి భయభ్రాంతులకు గురిచేసిన రియల్టర్
  • రెండు తుపాకులతో ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపిన ఎమ్మెల్యే
DMK MLA Arrested For Allegedly Opening Fire Over Property

ఓ స్థల వివాదం విషయంలో తుపాకితో ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపిన డీఎంకే ఎమ్మెల్యే ఇదయవర్మన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్‌ సమీపంలోని చెంగోడు గ్రామంలో అన్నాడీఎంకే నేత తాండవ మూర్తి బంధువుగా చెబుతున్న అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం నేత, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అయిన కుమార్‌ 350 ఎకరాల స్థలాన్ని చౌకగా కొనుగోలు చేశారు. ఈ స్థలంలోకి వెళ్లేందుకు దారి లేకపోయినా ప్లాట్లు వేసేందుకు కుమార్ ప్రయత్నించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలోని ఆలయానికి చెందిన స్థలం మీదుగా రోడ్డు వేసేందుకు ప్రయత్నించగా, దానిని కూడా అడ్డుకున్నారు.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కుమార్ శనివారం సాయంత్రం చెన్నై నుంచి 50 మంది కిరాయి రౌడీలతో గ్రామానికి చేరుకున్నాడు. వారు వస్తూవస్తూనే కత్తులు, కర్రలతో వీరంగం వేయడంతో గ్రామస్థులు వెనక్కి తగ్గారు. ఇదే అదునుగా భావించిన కుమార్ రోడ్డు పనుల్లోకి దిగాడు. విషయం తెలిసిన  డీఎంకే ఎమ్మెల్యే ఇదయవర్మన్‌ తండ్రి లక్ష్మీపతి ఘటనా స్థలానికి చేరుకుని కుమార్‌ను ప్రశ్నించాడు. లక్ష్మీపతి రావడంతో బలం వచ్చిన గ్రామస్థులు మళ్లీ అక్కడికి చేరుకోవడంతో వివాదం మళ్లీ మొదలైంది. దీంతో కుమార్ వెంట వచ్చిన రౌడీ మూక మళ్లీ రెచ్చిపోయింది.

కుమార్ రౌడీ మూకలు తన తండ్రిపై దాడి చేసినట్టు తెలుసుకున్న ఎమ్మెల్యే ఇదయవర్మన్ వెంటనే అక్కడకు చేరుకుని తన వద్దనున్న సింగిల్ బ్యారెల్ తుపాకితో కాల్పులు జరిపారు. దీంతో అక్కడున్న అందరూ ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయితే, కుమార్ మనుషులు ఎదురుదాడికి దిగడంతో ఎమ్మెల్యే తన నడుం భాగంలో దాచిపెట్టిన మరో తుపాకి బయటకు తీసి కాల్పులు జరిపారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు వాహనాలను తగలబెట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోగానే ఇరు వర్గాలు తిరుప్పోరూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి.

కాగా, ఎమ్మెల్యే కాల్పుల్లో గాయపడిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చేరగా, ఆ తర్వాత అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం మరింత కలకలానికి కారణమైంది. ఎమ్మెల్యేనే అతడిని ఎత్తుకెళ్లాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఈ ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యే, ఆయన తండ్రి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిన్న ఉదయం చెన్నై నుంచి చెంగల్పట్టు వైపు వెళ్తున్న ఇదయవర్మన్‌ను అరెస్ట్ చేశారు. కుమార్, అతడి అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News