కాంగ్రెస్ పార్టీలో ప్రతిభకు, సామర్థ్యానికి తగిన గుర్తింపు లేదు: జ్యోతిరాదిత్య సింధియా

13-07-2020 Mon 06:31
  • రాజస్థాన్ సీఎం గెహ్లట్ నుంచి పైలట్‌కు వేధింపులు
  • పార్టీ పరంగా ఆయనను పక్కనపెట్టారు
  • గెహ్లట్ సర్కారు మైనారిటీలో ఉందన్న సచిన్ పైలట్
jyotiraditya scindia once again fires on congress

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌పై ఆ పార్టీ మాజీ నేత, బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో ప్రతిభకు, సామర్థ్యానికి తగిన గుర్తింపు లేదని విమర్శించారు. రాజస్థాన్‌కు చెందిన తన మాజీ సహచరుడైన సచిన్ పైలట్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. పార్టీ పరంగా  ఆయనను పక్కనపెట్టారని, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌ నుంచి తన మాజీ సహచరుడు వేధింపులు ఎదుర్కోవడం చూస్తుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

జ్యోతిరాదిత్య సింధియా ఈ ఏడాది మార్చిలో బీజేపీలో చేరారు. ఆయనతోపాటు వెళ్లిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఇప్పుడు రాజస్థాన్‌లో సచిన్ పైలట్ కూడా రెబల్‌గా మారడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. కాగా, పైలట్ వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలియడంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగింది. ప్రస్తుతం గెహ్లట్ సర్కారు మైనారిటీలో ఉందన్న పైలట్ వ్యాఖ్యలు చూస్తుంటే ప్రభుత్వం కూలిపోక తప్పదని తెలుస్తోంది.