Golden Tiger: కజిరంగా అడవుల్లో దర్శనమిచ్చిన 'బంగారు పులి'... భారత్ లో ఉన్నది ఇదొక్కటే!

  • పసిడి వర్ణంలో కాంతులీనుతున్న పులి
  • జన్యులోపం వల్ల ఇలా కనిపిస్తుందన్న ఐఎఫ్ఎస్ అధికారి
  • అడవుల్లో ఇలాంటి పులి ఎంతో అరుదు అని వివరణ
Rare Golden Tiger has seen in Kaziranga National Park

విశాల భారతదేశంలో అటవీప్రాంతానికి కొదవలేదు. అదేస్థాయిలో అపారమైన జీవవైవిధ్యం కూడా భారత్ సొంతం. అనేక వన్యప్రాణులకు మనదేశం ఆవాసంగా ఉంది. అయితే, ఎంతో అరుదైన బంగారు రంగు పులి మాత్రం దేశంలో ఒక్కటి మాత్రమే ఉంది. ఆ ఒక్కటీ ఇటీవలే కజిరంగా అడవుల్లో దర్శనమిచ్చింది. సాధారణ పులులకు భిన్నంగా ఇది పసిడి వర్ణంలో మెరిసిపోతుంటుంది. దీని ముఖం కూడా ఇతర వ్యాఘ్రరాజాలకు భిన్నంగా కనిపిస్తుంది. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ దీని ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు.

అసోంలోని కజిరంగా ఫారెస్ట్ లో ఆ గోల్డెన్ టైగర్ గడ్డిపొదల వెలుపల కూర్చుని సేదదీరుతూ ఉండడాన్ని ఆ ఫొటోలో చూడొచ్చు. దీనికి స్ట్రాబెర్రీ టైగర్, టాబీ టైగర్ అని ప్రాంతాల వారీగా వివిధ పేర్లు ఉన్నాయి. ఈ పులికి బంగారు వర్ణం రావడంపై  అటవీశాఖ అధికారి పర్వీన్ కాశ్వాన్ వివరణ ఇచ్చారు. ఇది పుట్టుకతోనే జన్యులోపం వల్ల వస్తుందని వెల్లడించారు. ఇలాంటివి ప్రపంచంలో పలు చోట్ల జంతుప్రదర్శనశాలల్లో ఉన్నా, అటవీప్రాంతంలో కనిపించడం చాలా అరుదు అని వివరించారు.

More Telugu News