అమితాబ్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేసిన నేపాల్ ప్రధాని

12-07-2020 Sun 17:38
  • కరోనా బారినపడిన అమితాబ్, అభిషేక్ బచ్చన్
  • ట్విట్టర్ లో స్పందించిన నేపాల్ ప్రధాని కేపీ ఓలీ
  • భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదాలు
Nepal prime minister KP Oli wishes Amitabh Bachchan a swift recovery

కరోనా బారినపడిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ముంబయి నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ ట్విట్టర్ లో స్పందించారు. అమితాబ్, అభిషేక్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. "లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ సంపూర్ణ ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నాను" అంటూ కేపీ ఓలీ ట్వీట్ చేశారు. భారత్, నేపాల్ దేశాల మధ్య సరిహద్దు వివాదం రాజుకున్న సమయంలో కేపీ ఓలీ భారత నటుడి కోసం ట్వీట్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది.

ఇటీవలే భారత్ భూభాగంలోని లింపియధురా, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలను తనవిగా చెప్పుకుంటూ నేపాల్ ఆ ప్రాంతాలతో సరికొత్త మ్యాప్ ను పార్లమెంటులో ఆమోదింపజేసుకుంది. దీనిపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.