'ఆత్రేయపురం ప్రేమకథ' సినిమా తీస్తానంటూ అమ్మాయిలకు వల

12-07-2020 Sun 16:14
  • రాజధాని ప్రాంతంలో సినిమా పేరిట మోసం
  • అమ్మాయిలపై లైంగిక దాడులు
  • ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు వసూలు
Fraud in the name of Atreyapuram Preamkatha

సినీ రంగంలో అవకాశాల కోసం వచ్చేవారు మోసపోవడం అనేక సందర్భాల్లో జరిగింది. తాజాగా, ఆత్రేయపురం ప్రేమకథ అనే సినిమా పేరిట రావణ్ భిక్షు అనే వ్యక్తి అనేకమంది అమ్మాయిలను మోసగించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చైతన్య క్రియేషన్ బ్యానర్ పై సినిమా అంటూ రావణ్ భిక్షు యువతులకు వల విసిరాడు. కాగా, తాను జబర్దస్త్ లో కొంతకాలం పాటు కెమెరామన్ గా పనిచేశానంటూ చెప్పుకునేవాడు. అమరావతి పుణ్యక్షేత్రంలో సినిమా ప్రారంభిస్తున్నామంటూ ప్రచారం చేశాడు.

ఈ ప్రచారాన్ని నిజమేనని నమ్మిన విజయవాడ, గుంటూరుకు చెందిన యువతులు సినిమా అవకాశాల కోసం రాగా, వారి పరిస్థితిని ఆసరాగా చేసుకుని భిక్షు లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు వసూలు చేసినట్టు తెలిసింది. దీనిపై బాధితులు మీడియాను ఆశ్రయించారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ఏపీ మహిళా కమిషన్ స్పందించింది.

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఓ బాధితురాలితో స్వయంగా ఫోన్ లో మాట్లాడారు. బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, బాధితులకు తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరిస్తున్నామని వెల్లడించారు.