చికిత్స తీసుకుంటోన్న ఆసుపత్రి నుంచి వీడియో పోస్ట్ చేసిన అమితాబ్ బచ్చన్!

12-07-2020 Sun 12:33
  • ఆసుపత్రి సిబ్బంది గురించి మాట్లాడిన బిగ్‌ బీ
  • ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ సేవ‌ల‌ను అందిస్తున్నారని వ్యాఖ్య
  • దేవుడు తెల్ల‌కోటు వేసుకుని ఆసుపత్రిలో ప‌నిచేస్తున్నాడు
  • వారికి చేతులెత్తి మొక్కుతున్నాను
amitab post video about corona

బాలీవుడ్‌ నటుడు అమితాబ్ బచ్చన్‌కు  కరోనా సోకడంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తోన్న విషయం తెలిసిదే. ఇప్పటికే అమితాబ్ ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. తాజాగా, ఆయన ఒ వీడియో సందేశం విడుద‌ల చేశారు. నానావ‌తి ఆసపత్రి డాక్ట‌ర్లు‌, న‌ర్సులు, ఇత‌ర ఆసుపత్రి సిబ్బంది గురించి తాను మాట్లాడుతున్నానని చెప్పారు.

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆసుపత్రుల సిబ్బంది ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనై సేవ‌ల‌ను అందిస్తున్నారని ఆయన కొనియాడారు. తాను ఈ మ‌ధ్య సూర‌త్‌లోని ఓ బోర్డ్‌ను తన ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశానని అమితాబ్ అన్నారు.

అందులో దేవుడి గుళ్లు ఎందుకు మూసివేశారో తెలుసా? అని ఆయన ప్రశ్నిస్తూ.. దేవుడు తెల్ల‌కోటు వేసుకుని ఆసుపత్రిలో ప‌నిచేస్తున్నాడని అందుకే మూసేవేశారని చెప్పారు. కరోనా విజృంభణ ప‌రిస్థితుల్లో ప‌నిచేస్తున్న వైద్య సిబ్బంది దేవుడి వంటి వారని తెలిపారు.

మాన‌వత్వంతో వైద్య సిబ్బంది ప‌నిచేస్తున్నారని, వారు ప్రాణ‌దాత‌లుగా మారారని అమితాబ్‌ బచ్చన్ అన్నారు. వారికి తాను  చేతులెత్తి మొక్కుతున్నానని, వారు లేక‌పోతే మ‌నుషులంతా ఏమైపోయేవారోనని బిగ్‌ బీ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు నిరాశాజ‌న‌కంగా ఉన్న రోజుల‌ని తనకు తెలుసని చెప్పారు.

అంద‌రూ వారి ప‌రిధులు దాటి ప‌నిచేస్తున్నారని బిగ్‌ బీ అన్నారు. అందరిలోనూ ఒత్తిడి ఉందని, ఎవ‌రూ భ‌య‌ప‌డొద్దని, నిరాశప‌డొద్దని ఆయన అన్నారు. మ‌నమందరం క‌లిసి పోరాడాల్సిన సమయమిదని, అలా చేస్తేనే మ‌నం ఈ ప‌రిస్థితి నుండి బ‌య‌ట‌ప‌డ‌గలమని ఆయన అన్నారు. తనకు చికిత్స అందిస్తోన్న ఆసుపత్రి సిబ్బందికి ధ‌న్య‌వాదాలని, ఇలాగే సేవ‌లు అందిస్తే దేశ‌మంతా వైద్యులను ఎంతో ప్రేమ, గౌరవాలతో చూస్తుందని చెప్పారు.