వియత్నాంలో బంగారు హోటల్... గది అద్దె మనదేశంలో కన్నా తక్కువే!

11-07-2020 Sat 13:53
  • సర్వం బంగారు తాపడం
  • గది అద్దె రోజుకు రూ.20 వేలు మాత్రమే!
  • ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం కానున్న హోటల్
Hotel furnished with gold in Vietnam

ఇప్పటికే ప్రపంచంలో పలు చోట్ల బంగారం పూత పూసిన నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ మించిపోయేలా వియత్నాంలో పూర్తిగా బంగారు తాపడం చేస్తూ ఓ హోటల్ ను నిర్మిస్తున్నారు. హనోయ్ సిటిలోని ఈ హోటల్ పేరు డోల్స్ హనోయ్ గోల్డెన్ లేక్ హోటల్. పేరులో ఉన్న గోల్డెన్ అనే పదానికి సార్థకత చేకూరుస్తూ ఈ హోటల్ లో సర్వం సువర్ణమయం చేస్తున్నారు.

హోవా బిన్ గ్రూప్ 2009లో ఈ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణ పనులు ప్రారంభించింది. ప్రస్తుతం ఫినిషింగ్ వర్క్ జరుగుతోంది. హోటల్ లో ఎక్కడ చూసినా 24 క్యారెట్ల బంగారమే. ఆఖరికి లిఫ్టులు కూడా స్వర్ణ శోభతో మెరిసిపోనున్నాయి. డిసెంబరు నాటికి హోటల్ ప్రారంభం అవుతుందని యాజమాన్యం చెబుతోంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అడుగడుగునా పసిడి కాంతులీనే ఈ హోటల్ లో గది అద్దె రోజుకు రూ.20 వేలేనట! మనదేశంలోని స్టార్ హోటళ్లలో అద్దెలు ఇంతకు రెట్టింపు ఉంటాయి. ఇక ఈ హోటల్ లో కొన్ని గదులను బయటి వ్యక్తులు కొనుగోలు చేయవచ్చట. చదరపు మీటరు ధర రూ.4.9 లక్షలు!

అయితే, కొన్నవాళ్లు ఇందులో ఉండడానికి హోవా బిన్ గ్రూప్ నిబంధనలు అంగీకరించవు. వారు ఆ గదిని అద్దెకు ఇచ్చుకోవాల్సి ఉంటుందట. మొత్తమ్మీద ఈ 25 అంతస్తుల గోల్డెన్ హోటల్ వియత్నాంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహంలేదు.