సోనీ లివ్ కొత్త తరహా ప్రమోషన్.. నేరుగా ప్రేక్షకులకు ఫోన్ చేసి భయపెడుతున్న వైనం

11-07-2020 Sat 09:07
  • భీతి గొలిపేలా ప్రమోషన్ చేసిన సోనీ లివ్
  • నిర్మాత స్మృతి కిరణ్‌కు ఫోన్ చేసి భయంకరమైన హత్యను చూశానన్న వ్యక్తి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత
SonyLIV receives flak for insensitive promotional gimmick

ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచేందుకు జాతీయ టెలివిజన్ చానల్ సోనీ లివ్ చేసిన ఓ ప్రమోషన్ భీతి గొలిపేలా ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. సోనీ లివ్ చానల్‌లో త్వరలో ఓ క్రైం థ్రిల్లర్‌ ప్రసారం కాబోతోంది. ఈ షో గురించి ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచి ఆకట్టుకునేందుకు దీని ప్రమోషన్‌ను వినూత్నంగా చేయాలని షో నిర్వాహకులు భావించారు.

అందులో భాగంగా చానెల్ నుంచి ఒకరు ప్రేక్షకులకు కాల్ చేసి, తాను దారుణమైన హత్యను చూశానని, చాలా భయంగా ఉందంటూ వణికిపోతూ చెబుతాడు. అవతలి వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించే లోపే ఆ కాల్ కట్ అవుతుంది. ఇలాటి ఫోన్ కాలే బాలీవుడ్ నిర్మాత స్మృతి కిరణ్‌కు రావడంతో ఆమె కూడా భయపడిపోయింది. అయితే, ఆ తర్వాత అది ప్రమోషన్ కోసం చేసిన కాల్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

ఆ వెంటనే ఆమె ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ సోనీ లివ్ చానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అది నిజమైన ఫోన్ కాల్ కాదని, ప్రమోషన్ కోసమే దానిని చేశారని తనకు ముందుగా తెలియదని పేర్కొన్నారు. అంతకుముందు ఆమె ఫోన్ కట్ అయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన సోనీ లివ్ చానల్ నిర్వాహకులు స్పందించారు. క్షమించమని కోరారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్నది తమ ఉద్దేశం కాదని అన్నారు. కాగా, తనకు కూడా ఇలాంటి ఫోన్ కాలే వచ్చిందంటూ మరో వ్యక్తి కూడా ట్వీట్ చేశాడు.