జగన్ ట్రాప్ లో పడి అడ్డదారులు తొక్కుతున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకుంటారు: లోకేశ్

10-07-2020 Fri 19:59
  • బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపణ
  • రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే వేధింపులంటూ వ్యాఖ్యలు
  • పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆగ్రహం
 Nara Lokesh alleged police files cases on victims instead of culprits

జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు పోలీసులు బాధిత కుటుంబంపైనే కేసు నమోదు చేసి వేధిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు గుంటూరు జిల్లా కనమలచెరువు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాసరయ్య కుటుంబంపై జగన్ రెడ్డి గూండాలు దాడి చేశారని ఆరోపించారు. అయితే పోలీసులు బాధితులపైనే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే వేధింపులు అని విమర్శించారు. కక్ష సాధింపు కోసం జగన్ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ట్రాప్ లో పడి అడ్డదారులు తొక్కుతున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు.