కరోనాను మించిన వైరస్ తో అనూహ్య మరణాలు అంటూ వార్త.. వట్టి ఫేక్ న్యూస్ అని తేల్చిన కజకిస్థాన్

10-07-2020 Fri 18:13
  • కజకిస్థాన్ లో కొత్తరకం న్యూమోనియా అంటూ ప్రచారం
  • తన పౌరులను అప్రమత్తం చేసిన చైనా
  • చైనా ప్రచారంలో నిజంలేదన్న కజకిస్థాన్
Kazakhstan refutes China statement on new virus causes more deaths

కజకిస్థాన్ లో కరోనాను మించి ఓ అంతుచిక్కని వైరస్ విజృంభిస్తోందని, కొన్ని వారాలుగా ఈ వైరస్ కారణంగా వందల సంఖ్యలో చనిపోతున్నారని చైనా దౌత్య కార్యాలయం ప్రకటించడం తెలిసిందే. కజకిస్థాన్ లో ఉన్న తమ పౌరులను అప్రమత్తం చేసేందుకే ప్రకటన వెలువరించామని పేర్కొంది. ఈ వైరస్ సోకిన రోగుల్లో న్యూమోనియా తీవ్రస్థాయిలో వస్తోందని, అత్యధికులు చనిపోతున్నారని వివరించింది. దీనిపై కజకిస్థాన్ ప్రభుత్వం వెంటనే స్పందించింది.

చైనా దౌత్య కార్యాలయం ప్రచారం చేస్తున్న దాంట్లో నిజంలేదని, వట్టి ఫేక్ న్యూస్  అని కొట్టిపారేసింది. చైనా మీడియాలో దీనిపై వస్తున్న కథనాలు, చైనా దౌత్య కార్యాలయ ప్రకటన అన్నీ తప్పుడు వార్తలేనని కజకిస్థాన్ ఆరోగ్య సంరక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇటీవల కొన్ని మరణాల్లో బ్యాక్టీరియా, ఫంగల్, తీవ్ర నెమ్ము కారణంగా సంభవించినవి ఉన్నాయని, వాటిలో కొన్ని అస్పష్ట కారణాలతో సంభవించిన మరణాలు కూడా ఉన్నాయని వివరించింది. వీటన్నింటిని తమ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆయా జాబితాల్లో పొందుపరుస్తోందని, అంతమాత్రం చేత "అంతుచిక్కని వైరస్, కజకిస్థాన్ లో కొత్త రకం న్యూమోనియా జబ్బు" అంటూ చైనా ప్రచారం చేయడం సరికాదని హితవు పలికింది.