Father: కుమార్తెను లైంగికంగా వేధించిన వారిపై ఓ తండ్రి అసాధారణ పోరాటం!

  • టెన్నిస్ కోచింగ్ కు వెళ్లిన బాలిక
  • బాలికపై ఐదుగురు కుర్రాళ్ల లైంగిక దాడి
  • అత్యాచారానికి పాల్పడిన వారిలో డేవిస్ కప్ ఆటగాడు
Father fought for justice after his daughter was assaulted by five men

భారత్ లో మహిళలపై అఘాయిత్యాలు, వేధింపుల ఘటనలకు ఇప్పటికీ అడ్డుకట్ట పడడంలేదు. వీటిలో చాలా ఘటనలు తెరపైకి రాకుండానే మరుగున పడిపోతుండగా, కొన్ని ఘటనల్లో సరైన ఆధారాలు లేక, చట్టంలో లొసుగులతో సరైన న్యాయం జరగని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఓ తండ్రి తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారిపై తీవ్ర పోరాటం సాగించాడు. తాము మైనర్లమంటూ జన్మదిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి బెయిల్ పొందిన వారిని మళ్లీ బోనెక్కించాడు. ఈ ఉదంతం చండీగఢ్ లో జరిగింది.

ఓ అమ్మాయి టెన్నిస్ లో రాణించాలన్న ఆకాంక్షతో నగరంలోని ప్రముఖ టెన్నిస్ కోచింగ్ అకాడెమీలో చేరింది. అయితే, ఐదుగురు కుర్రాళ్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు జూనియర్ డేవిస్ కప్ ఆటగాడు కావడం గమనార్హం. అయితే, ఆ బాలిక తండ్రి తన బిడ్డకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కానీ, వారు మైనర్లన్న కారణంగా బెయిల్ పొందారు. కోర్టులో విచారణ సందర్భంగా, టెన్నిస్ అకాడమీ ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్లను నిందితులు కోర్టుకు అందించారు. దాంతో మైనర్లన్న కారణంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

తన కుమార్తె జీవితంతో ఆడుకున్న ఆ దుర్మార్గులు బెయిల్ పై బయటికి రావడాన్ని ఆమె తండ్రి జీర్ణించుకోలేకపోయారు. అయితే, బర్త్ సర్టిఫికెట్లు నిజమైనవి కావని నమ్మిన ఆయన వెంటనే పోలీసు తరహాలో పరిశోధనకు దిగారు. వాళ్ల నిజమైన బర్త్ సర్టిఫికెట్లు తెచ్చేందుకు వాళ్ల స్వస్థలాలకు పయనమయ్యారు. ఒక్కొక్కరిది ఒక్కో ప్రాంతం అయినా, ఎంతో శ్రమించి అన్ని ప్రాంతాలకు తిరిగాడు. రోహ్ తక్, పల్వాల్, హిస్సార్ వంటి ప్రాంతాలకు తిరిగాడు. వాళ్లు చదివిన పాఠశాలలకు కూడా వెళ్లి ఎంక్వైరీ చేశాడు. ఎట్టకేలకు సాధించాడు.

వారిలో ముగ్గురు మైనర్లు కాదని తేలింది. వారి అసలైన జన్మదిన ధ్రువీకరణ పత్రాలను కోర్టులో సమర్పించగా, ఆ పత్రాలు సరైనవో కాదో తేల్చాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసుల దర్యాప్తులో అవన్నీ నిజమైనవేనని తేలింది. ఆ బాలిక తండ్రి సమర్పించిన సర్టిఫికెట్లు సరైనవేనంటూ పోలీసులు కోర్టుకు నివేదించారు. ఇప్పుడా తండ్రి ముఖంలో విజయగర్వం తొణికిసలాడుతోంది.

ఎట్టకేలకు తన కుమార్తెకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో తన పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా విచారణలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం పెండింగ్ లో ఉంది. తిరిగి కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైతే ఈ కేసుపై విచారణ కొనసాగనుంది.

More Telugu News