ఎంపీ రఘురామకృష్ణరాజుపై పోలీస్ స్టేషన్లలో మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు

10-07-2020 Fri 11:47
  • ఇప్పటికే పలువులు వైసీపీ నేతల ఫిర్యాదు
  • తమపై అతస్య ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
  • తమను జంతువులతో పోల్చుతున్నారని మండిపాటు
  • తాజాగా ఎమ్మెల్యేలు కారుమూరి, ముదునూరి ఫిర్యాదులు
complaint against raghurama krishnam raju

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తమపై అతస్య ప్రచారం చేస్తున్నారని, పందులు అంటూ తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు తమ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లలో వరసగా ఫిర్యాదులు చేస్తున్నారు. తన గురించి రఘురామకృష్ణరాజు చేస్తోన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని ఇప్పటికే ఏపీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీస్ స్టేషన్‌లో, వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం వన్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు.

తాజాగా, వైసీపీ ఎమ్మెల్యేలు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాద్‌రాజు కూడా రఘురామకృష్ణరాజుపై  తణుకు, నరసాపురం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఆయన తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, తమను జంతువులతో పోల్చారని వారు పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన అనంతరం రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. 'పందులే గుంపులుగా వస్తాయి' అంటూ వ్యాఖ్యలు చేసి కించపర్చారంటూ సదరు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.