అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా 'చాన్స్' ఇప్పిస్తానంటూ వల... కేసు నమోదు!

10-07-2020 Fri 08:47
  • గీతా ఆర్ట్స్ లో డిజైనర్ నంటూ చాటింగ్
  • సినిమాలో అవకాశం ఇప్పిస్తానని ట్రాప్
  • సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మేనేజర్ సత్య
Police Case on Unidentified Person Who Fruad in the Name of Geetha Arts

ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేరిట, హీరోయిన్లుగా ఒక్క చాన్స్ కోసం ఎదురుచూస్తున్న అమ్మాయిలను కొందరు కేటుగాళ్లు మోసం చేస్తుండగా, సంస్థ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశాన్ని ఇస్తామని, త్వరలో బన్నీ నటించే తమిళ సినిమాలో చాన్స్ అంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అమ్మాయిలకు వల వేస్తున్నాడు.

తాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో డిజైనర్ నని, మేకప్ మ్యాన్ నని చెప్పుకుంటూ ఔత్సాహిక యువతులతో చాటింగ్ చేస్తున్న అతను, సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని నమ్మబలుకుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గీతా ఆర్ట్స్, అతనిపై ఫిర్యాదు చేసింది. సంస్థ తరఫున మేనేజర్ సత్య సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తమ బ్యానర్ పేరును చెప్పి, ఓ వ్యక్తి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడన్న అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాఫ్తు ప్రారంభించారు.