Telangana: తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేయాలి: హైకోర్టులో పిటిషన్‌

  • యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాం 
  • తేదీలను మూడు వారాల తర్వాత ఖరారు చేస్తామన్న సర్కారు 
  • యూజీసీ మార్గదర్శకాలు సూచనలు మాత్రమేనన్న పిటిషనర్‌  
  • కౌంటర్‌ దాఖలు చేయాలని సర్కారుకి హైకోర్టు ఆదేశం
pitition on degree pg exams

తెలంగాణలో ఇప్పటికే పది పరీక్షలు, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను మాత్రం తప్పనిసరిగా నిర్వహించాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఇటీవలే ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై ఎస్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి, వాటిని రద్దు చేయాలని కోరారు.

ఈ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం తరఫున ఏజీ తెలిపారు. ఇందుకు సంబంధించిన తేదీలను మూడు వారాల తర్వాత ఖరారు చేస్తామన్నారు. అయితే, పరీక్షలను రద్దు చేసి ఇంటర్నల్‌ మార్కుల ద్వారా గ్రేడింగ్‌ ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది దామోదర్‌ రెడ్డి కోరారు.

పరీక్షల విషయంలో యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనని చెప్పారు. కరోనా విజృంభణ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ పరీక్షలను రద్దు చేశాయన్నారు. దీంతో మూడు వారాల్లో పరీక్షల నిర్వహణపై వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సర్కారుని హైకోర్టు ఆదేశించింది.

More Telugu News