america: చైనాపై కఠిన చర్యలు?.. కీలక ప్రకటన చేయనున్న అమెరికా

  • ప్రణాళిక సిద్ధం చేసుకున్న అమెరికా?
  • శ్వేతసౌధ  మీడియా కార్యదర్శి కేలే మెకానీ కీలక వ్యాఖ్యలు
  • చైనాపై తీసుకోనున్న చర్యలపై త్వరలోనే ఓ వార్త వింటారు
  • ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పగలను
america on china

కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న అమెరికా అధ్యక్షుడు డ్రాగన్ దేశంపై ప్రతీకార చర్యలు తప్పవని కొన్ని రోజులుగా హెచ్చరికలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు అమెరికా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. చైనాపై తీసుకునే చర్యల గురించి శ్వేతసౌధ ‌ మీడియా కార్యదర్శి కేలే మెకానీ కీలక వ్యాఖ్యలు చేశారు.

డ్రాగన్‌ దేశంపై ట్రంప్ ఎటువంటి చర్యలు తీసుకోనున్నారో తాను ఇప్పుడే చెప్పలేనని, అయితే ఆ దేశంపై తీసుకోనున్న చర్యలపై త్వరలోనే ఓ వార్త వింటారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పగలనని తెలిపారు. చైనా సోషల్ మీడియా యాప్‌లపై నిషేధం విధిస్తామని ఇటీవల అమెరికా అధికారులు సూచనలు కూడా చేశారు.  

మరోపక్క, పలు విషయాలలో చైనా చర్యలు తమ దేశానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని అమెరికా మేధావులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య ప్రధాన కేంద్రాల్లో ఒకటైన  హాంకాంగ్‌ విషయంలో చైనా ఇటీవల తీసుకున్న చర్యలపై అమెరికా మండిపడుతోంది. అంతేగాక, టిబెట్‌తో పాటు పలు విషయాలపై చైనా‌ విధానంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
 
కాగా, అమెరికాలో కరోనా ఉద్ధృతికి ఏ మాత్రం అడ్డుకట్టపడడం లేదు. ప్రతిరోజు 50,000 మంది కంటే ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ అవుతోంది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య నిన్నటితో 30 లక్షల మార్కు దాటింది. దాదాపు లక్షన్నరమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో చైనాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపేసి, దాని నుంచి శాశ్వతంగా వైదొలుగుతామని ప్రకటించారు.

More Telugu News