vikas dubay: ఎట్టకేలకు యూపీ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే అరెస్టు.. వీడియో ఇదిగో

  • వారం రోజులుగా తప్పించుకుని తిరుగుతోన్న దూబే
  • మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అరెస్టు
  • ఇటీవల చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న గ్యాంగ్‌స్టర్‌
police arrests dubay

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో‌ ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌ ఘటనలో 8 మంది పోలీసుల మృతికి కారణమైన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడి కోసం 25 పోలీసు బృందాలు ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌లో గాలిస్తోన్న విషయం తెలిసిందే. అతడు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పట్టుకున్నారు. అనంతరం అతడిని నడిరోడ్డుపై నడిపించుకుంటూ పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజు నుంచి అతడు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతోన్న విషయం తెలిసిందే.

యూపీలోని హమీర్‌పూర్‌లోని మౌదాహా గ్రామంలో పోలీసులు నిన్న ఎన్‌కౌంటర్‌లో వికాస్‌ అనుచరుడు అమర్‌ దూబేను హతమార్చారు. దీంతో తనను కూడా కనపడగానే హతమార్చుతారని భయపడుతోన్న వికాస్‌ దూబే పోలీసులకు లొంగిపోవాలని ప్రయత్నాలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి.

ఇక పోలీసులకు అతడి గురించి ఎలా సమాచారం అందిందన్న విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు, రెండు రోజుల క్రితం హర్యానాలోని ఫరీదాబాద్‌లో దూబే ఓ ఇంట్లో ఉన్నాడని పోలీసులకు తెలిసి, అక్కడకు వెళ్లగా, అతడు అక్కడి నుంచి అప్పటికే పారిపోయాడు. అదే ఇంట్లో ఉంటోన్న దూబే అనుచరులు అంకుర్‌, శ్రావణ్‌, కార్తీకేయను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. వారి ద్వారానే దూబే ఆచూకీని పోలీసులు కనిపెట్టారా? లేక ఎన్‌కౌంటర్‌ భయంతో ఆ గ్యాంగ్‌స్టరే లొంగిపోయాడా? అన్న విషయం తెలియాల్సి ఉంది.

More Telugu News