Russia: మీ పని మీరు చూసుకోండి: అమెరికాకు రష్యా వార్నింగ్ 

  • 30 ఏళ్ల జర్నలిస్టును అరెస్ట్ చేసిన రష్యన్ సెక్యూరిటీ ఏజెన్సీ
  • రక్షణ శాఖ సమాచారాన్ని ఓ నాటో సభ్య దేశానికి అందించాడంటూ అభియోగం
  • ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులు
Russia gives warning to USA

'మైండ్ యువర్ ఓన్ బిజినెస్' అంటూ అమెరికాకు రష్యా కాస్త కటువుగా చెప్పింది. రష్యాలోని మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోతోందని, మీడియాను నియంత్రించేందుకు రష్యా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాస్కోలోని అమెరికా దౌత్య కార్యాలయ అధికారి ప్రతినిధి రెబెక్కా రాస్ తీవ్ర విమర్శలు చేశారు. రష్యన్ జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని చూసిన తర్వాత... మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని ఆమె ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై రష్యా అగ్గిమీద గుగ్గిలం అయింది. మీ పని మీరు చూసుకోవాలంటూ అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది.

ఇవాన్ సఫ్రనోవ్ అనే 30 ఏళ్ల జర్నలిస్టును రష్యన్ సెక్యూరిటీ ఏజెన్సీ అదుపులోకి తీసుకుంది. రష్యా రక్షణ రంగానికి సంబంధించి రాజద్రోహానికి పాల్పడ్డాడంటూ ఆయనపై అభియోగాలు మోపింది. రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించి ఒక నాటో సభ్య దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ విభాగానికి అందించాడని ఆరోపించింది. ఇవాన్ ను అరెస్ట్ చేయడంతో జర్నలిస్టులు, మద్దతుదారులు మండిపడుతున్నారు. రక్షణ శాఖపై కవరేజ్ చేస్తే పనిష్మెంట్ ఇస్తారా అని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే రష్యాలోని ప్రధాన టీవీ స్టేషన్లన్నీ ఆ దేశ ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారంటూ ఇప్పటికే ప్రింట్, ఆన్ లైన్ విభాగాల్లో పని చేస్తున్న జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News