కేసీఆర్ ఎక్కడుంటే మీకెందుకు..?: కాంగ్రెస్ నేతలపై మండిపడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

08-07-2020 Wed 12:07
  • టీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్షాల ధ్వజం
  • కాంగ్రెస్, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగిన శ్రీనివాస్ గౌడ్
  • మరోసారి సెక్షన్-8 అంటే నాలుక కోస్తారని హెచ్చరిక
Telangana minister Srinivas Goud fires on opposition leaders

గత కొన్నిరోజులుగా తెలంగాణలో కరోనా రక్కసి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో విపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్ పైనా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దానికితోడు పాత సచివాలయం కూల్చివేతపై మండిపడుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉంటే కేసీఆర్ ఎక్కడున్నాడంటూ ప్రతిపక్ష నేతలు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఎక్కడుంటే మీకెందుకని నిలదీశారు. ఏ ఒక్క ప్రభుత్వ పథకమైనా ఆగిందా? అంటూ ప్రశ్నించారు. ఆరేళ్ల కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగమని తెలిపారు. తెలంగాణ వెనుకబాటుతనానికి ఆంధ్రా నాయకులే కారణమని ఇన్నాళ్లూ భావించామని, కానీ ఇక్కడి నాయకులే కారణమని ఇప్పుడర్థమవుతోందని అన్నారు.

"ఉత్తమ్ కుమార్ రెడ్డీ... ముందు నీ కుర్చీ కాపాడుకో, తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడున్నావ్? ఆంధ్రా వాళ్లు మాట్లాడినట్టు మీరు కూడా సెక్షన్-8 అంటున్నారు. మరోసారి సెక్షన్-8 అంటే నాలుక తెగ్గోస్తారు. ఎందుకు పక్కవాళ్లను రెచ్చగొడుతున్నారు? హైదరాబాద్ నగరం తెలంగాణ సొత్తు. ఇక్కడ ఇతరుల పెత్తనాన్ని సహించం" అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.