అచ్చెన్నాయుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించండి: హైకోర్టు ఆదేశాలు

08-07-2020 Wed 11:24
  • ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని అచ్చెన్న పిటిషన్
  • గుంటూరులోని రమేశ్‌ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి
  • ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరాలు 
  • న్యాయవాది వాదనను తోసిపుచ్చిన కోర్టు 
atchannaidu to be taken treatment in private hospital

ఈఎస్‌ఐ మందుల కొనుగోలు అవకతవకల కేసులో విచారణ ఎదుర్కొంటోన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. తనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ఆయన చేసుకున్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. అచ్చెన్నాయుడిని గుంటూరులోని రమేశ్‌ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి నిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

విజయవాడ లేదా గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏదైనా ఒక ఆసుపత్రికి తరలించాలన్న అంశంపై వాదనలు కొనసాగగా, చివరకు కోర్టు తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అరెస్టయిన అచ్చెన్నాయుడును ఏ ఆసుపత్రికి తరలించాలన్న విషయంపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వాదించారు. అయితే, ఆ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పుతో పోలీసులు అచ్చెన్నాయుడును కాసేపట్లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించనున్నారు.