టీడీపీ హయాంలో కట్టిన 6 లక్షల ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలి: సీపీఐ రామకృష్ణ

07-07-2020 Tue 20:18
  • ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యమే కారణం
  • ప్రమాదానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలి
  • ప్రభుత్వ సంస్థలను మోదీ నాశనం చేస్తున్నారు
CPI Ramakrishna demands to allocate 6 laks houses constructed during TDP rule

భారత ప్రధాని మోదీపై సీపీఐ ఏపీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. చివరకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రాన్ని కూడా ప్రైవేటుకు అప్పగించే దిశగా అడుగులు వేస్తున్నారని విమర్శించారు. దేశ చరిత్రలో ఏ ప్రధాని కూడా ఇలాంటి చర్యలకు పాల్పడలేదని అన్నారు. మోదీ చర్యలను నిరసిస్తూ ఈనెల 9న చలో శ్రీహరికోట కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని చెప్పారు.

విశాఖలో గ్యాస్ లీకేజ్ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పై కూడా ఆయన స్పందించారు. ఈ ప్రమాదానికి సదరు కంపెనీ యాజమాన్యమే కారణమని చెప్పారు. ఎప్పుడైనా సరే ప్రమాదానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన ఆరు లక్షల ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని కోరారు.