టిక్‌టాక్‌ సహా చైనా యాప్‌లపై నిషేధం విధిస్తాం: అమెరికా

07-07-2020 Tue 09:58
  • ఇటీవలే భారత్‌లో 59 యాప్‌ల నిషేధం
  • తామూ బ్యాన్‌ అంశంపై పరిశీలిస్తున్నామన్న పాంపియో 
  • నిషేధించాలని ప్రభుత్వానికి భద్రతా సలహాదారుల సిఫార్సు  
US Looking At Banning Chinese Social Media Apps

గాల్వన్‌ లోయ వద్ద చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశ సార్వభౌమాధికారం, జాతీయ భద్రత, రక్షణ శాఖ రహస్యాలు, దేశ సమగ్రత వంటి అంశాలకు భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమెరికా కూడా ఇదే దిశగా వెళ్తోంది. తాజాగా, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్‌లను నిషేధించే అంశాన్ని తమ దేశం పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.

కాగా, చైనాకు చెందిన ముఖ్యమైన 59 యాప్‌లపై భారత్ నిషేధం విధించడాన్ని ఇటీవలే అమెరికా ప్రశంసించిన విషయం తెలిసిందే. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు ఈ చర్య దోహదపడుతుందని ఇటీవలే మైక్ పాంపియో వ్యాఖ్యానించారు. అమెరికాలోనూ టిక్ టాక్‌ను నిషేధించాలని తమ ప్రభుత్వానికి ఇటీవల జాతీయ భద్రతా సలహాదారులు సిఫార్సు చేశారు. ఇటువంటి యాప్‌ల ద్వారా చైనా ప్రభుత్వం అమెరికా పౌరుల డేటాను తస్కరిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆ దిశగా చర్యలు తీసుకోవాలనుకుంటోంది.