కరోనా సోకడంతో ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం... ఢిల్లీ ఎయిమ్స్ భవనంపై నుంచి దూకి జర్నలిస్ట్ ఆత్మహత్య!

07-07-2020 Tue 08:20
  • ఢిల్లీ పత్రికలో పనిచేస్తున్న తరుణ్
  • ఇటీవల సోకిన కరోనా మహమ్మారి
  • నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
Journalist with Corona Sucide in Delhi AIIMS

ఢిల్లీలో ఓ పాత్రికేయుడు, కరోనా సోకి, ఉద్యోగం పోయిందన్న కారణంతో తీవ్ర మనస్తాపం చెంది, బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ దినపత్రికలో తరుణ్ సిసోడియా అనే యువకుడు విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స నిమిత్తం చేర్పించారు.

ఇదే సమయంలో వైరస్ బారిన పడ్డాడన్న కారణంతో అతన్ని పత్రిక యాజమాన్యం ఉద్యోగం నుంచి తీసేసినట్టు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన అతను, ఎయిమ్స్ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని కాపాడేందుకు ఆసుపత్రి వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలించలేదు. చికిత్స పొందుతూ అతను మరణించాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.