సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

07-07-2020 Tue 07:23
  • బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కీర్తి సురేశ్ 
  • తగ్గించుకుంటున్న బాలయ్య, బోయపాటి
  • విజయ్ 'మాస్టర్' విడుదలపై అప్ డేట్  
Keerthi Suresh plays bank employee role

*  మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందే 'సర్కారు వారి పాట' చిత్రంలో కథానాయికగా కీర్తి సురేశ్ ఎంపిక దాదాపు పూర్తయింది. ఇందులో ఆమె బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
*  బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందుతున్న మూడో చిత్రం షూటింగును వచ్చే నెలలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితులలో బడ్జెట్టును తగ్గించే క్రమంలో ఈ చిత్రం అవుట్ డోర్ షూటింగులను కేన్సిల్ చేసి, ఇండోర్లోనే చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అలాగే, బాలకృష్ణ, బోయపాటి తమ పారితోషికాన్ని కూడా తగ్గించుకుంటున్నట్టు తెలుస్తోంది.  
*  తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' చిత్రం విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. దీంతో ఈ చిత్రాన్ని ఇక దీపావళి సందర్భంగా నవంబర్ 12న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించాడు. తెలుగు, తమిళ భాషల్లో దీనిని ఒకేసారి విడుదల చేస్తారు.