ఏపీలో సింగిల్ డే రికార్డు... ఒక్కరోజులో 1322 కరోనా పాజిటివ్ కేసులు

06-07-2020 Mon 16:34
  • రాష్ట్రంలో 20 వేల మార్కు దాటిన కరోనా కేసులు
  • అత్యధికంగా గుంటూరు జిల్లాలో 197 కొత్త కేసులు
  • రాష్ట్రంలో మరో ఏడుగురి మృతి
AP witnessed single day spike in corona cases

ఏపీలో కరోనా మహమ్మారి అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందే తప్ప, నియంత్రణలోకి రావడంలేదు. తాజాగా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారితో కలుపుకుని 1322 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే ప్రథమం. అంతేకాదు, ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20019గా నమోదయింది.

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 197, తూర్పుగోదావరి జిల్లాలో 171, అనంతపురం జిల్లాలో 142, కర్నూలు జిల్లాలో 136, చిత్తూరు జిల్లాలో 120, పశ్చిమ గోదావరి జిల్లాలో 106, విశాఖపట్నం జిల్లాలో 101 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనాతో ఏపీలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. దాంతో కరోనా మరణాల సంఖ్య 239కి పెరిగింది. తాజాగా 424 మంది డిశ్చార్జి కాగా, 10,860 మంది చికిత్స పొందుతున్నారు.