China: భారత్‌ దెబ్బకు ఎట్టకేలకు వెన‌క్కి త‌గ్గిన చైనా.. గాల్వన్‌ లోయ నుంచి వెళ్లిపోతున్న డ్రాగన్ సైన్యం

  • దాదాపు 2 కిలోమీట‌ర్ల దూరం వెనక్కి 
  • భారత్‌-చైనా తాత్కాలిక నిర్మాణాల తొల‌గింపు
  • చైనా పారదర్శకంగా వ్యవహరిస్తుందా? అన్న దానిపై భారత్ దృష్టి 
  • దశల వారీగా ఇరు దేశాల సైన్యాలు వెనక్కి
Chinese troops pull back 2 km from site of Galwan Valley clashes says govt

తూర్పు గాల్వ‌న్ లోయ‌ వద్ద ఉద్రిక్తతలు నెలకొనేలా దుందుడుకు చర్యలకు పాల్పడిన చైనా ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. ఆ ప్రాంతంలో డ్రాగన్‌ చర్యలకు భారత్ దీటుగా బదులిస్తోన్న విషయం తెలిసిందే. మరోవైపు, అంతర్జాతీయంగా భారత్‌కు పలు దేశాలు మద్దతిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య శాంతి కోసం భారత్‌తో చర్చల్లో పాల్గొంటోన్న చైనా సైన్యం గాల్వన్‌ లోయ వద్ద నుంచి దాదాపు 2 కిలోమీట‌ర్ల దూరం వెనక్కి వెళ్లిందని భారత ప్ర‌భుత్వ అధికారి ఒక‌రు మీడియాకు తెలిపారు.

ఘర్షణ నెలకొన్న ప్రాంతం నుంచి భారత్‌-చైనా తాత్కాలిక నిర్మాణాల‌ను తొల‌గించిన‌ట్లు ప్రభుత్వ వ‌ర్గాలు చెప్పాయి. అయితే, చైనా పారదర్శకంగా వ్యవహరిస్తుందా? మళ్లీ సైన్యాన్ని ముందుకు పంపుతుందా? అన్న విషయంపై తాము దృష్టి పెడతామని భారత అధికారులు వివరించారు.

ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక చర్యలకు సిద్ధం అవుతున్న రీతిలో సరిహద్దు ప్రాంతాల్లో చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి జరిగిన చర్చల ఫలితంగా గాల్వ‌న్‌, పాన్‌గాంగ్ సో, హాట్ స్ప్రింగ్స్ నుంచి సైనికుల‌ను వెన‌క్కి పంపాల‌ని ఇటీవలే ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

దశల వారీగా ఇరు దేశాలు తమ సైన్యాన్ని వెనక్కు పిలిపించుకోవాలని భావిస్తున్నాయి. తొలి దశలో బలగాలను వెనక్కి పిలిపించిన తర్వాత.. చైనా సైన్యం నిజంగానే వెనక్కి వెళ్లిందా? అన్న అంశాన్ని నిర్ధారించుకుని, రెండో దశలో మరిన్ని బలగాలను ఉపసంహరించుకుంటామని భారత అధికారులు అంటున్నారు. మ‌రోసారి త్వరలోనే ఇరు దేశాల అధికారులు సమావేశమయ్యే అవకాశం ఉంది.

More Telugu News