Pawan Kalyan: లా నేస్తం పథకాన్ని ఎందుకు కొనసాగించడంలేదు?: వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కల్యాణ్

  • కరోనా కష్టకాలంలో లాయర్లకు తగ్గిన ఉపాధి
  • క్లయింట్ల నుంచి ఫీజులు వచ్చే మార్గంలేక అష్టకష్టాలు
  • లాయర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని సూచన
Pawan Kalyan questions AP government on Law Nestam

న్యాయవాదుల సంక్షేమం కోసం ఏపీ సర్కారు రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించిందని, జీవో ఇచ్చినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. జూనియర్ న్యాయవాదుల కోసం ప్రకటించిన లా నేస్తం పథకాన్ని ఎందుకు కొనసాగించడంలేదని ప్రశ్నించారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు ఇస్తామన్నారని, గత నాలుగు నెలలుగా ఈ పథకం అమలు జరిగుంటే ఈ కష్టకాలంలో వారికి ఎంతో భరోసా లభించేదని పేర్కొన్నారు.

కరోనా ప్రభావంతో మేజిస్ట్రేట్ కోర్టుల నుంచి ఉన్నత న్యాయస్థానం వరకు అన్నీ విరామం ప్రకటించాయని, ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవాదులు చాలీచాలని సంపాదనతో నెట్టుకొస్తున్నారని, లా చదివి ఉన్నతమైన వృత్తిలో ఉన్నా ఆర్థికంగా కుదురుకునే పరిస్థితి ఎక్కువమందికి లేదని వివరించారు. కరోనా లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా క్లయింట్ల నుంచి ఫీజులు రాక 80 శాతం మంది లాయర్లు అరకొర సంపాదనతో అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందని, బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని పంపారని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క న్యాయవాదికి 6 నెలల పాటు రూ.10 వేలు చొప్పున ఆర్థికసాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కనీసం వడ్డీలేని రుణాలు మంజూరు చేసినా లాయర్ల పరిస్థితి మెరుగవుతుందని సూచించారు.

More Telugu News