భారత్ పూర్తి సన్నద్ధం: మన సుఖోయ్ లు, మిగ్ యుద్ధ విమానాల రొదతో దద్దరిల్లుతున్న చైనా సరిహద్దులు

04-07-2020 Sat 21:50
  • సరిహద్దుల్లో ఉద్రిక్తతలు!
  • బలగాలను భారీగా తరలిస్తున్న భారత్
  • పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్న భారత వాయుసేన
Indian Air Force fully prepared for any situation at borders

చైనాతో వాస్తవాధీన రేఖ పొడవునా భారత్ సైనిక మోహరింపులు ఊపందుకున్నాయి. ఓవైపు అత్యాధునిక ఆయుధ సమీకరణ చేపడుతున్న భారత్, అందుబాటులో ఉన్న ఆయుధ సంపత్తిని చైనా సరిహద్దుల దిశగా తరలిస్తోంది. ఇక, భారత వాయుసేన కూడా తాజాగా పరిస్థితుల నేపథ్యంలో సన్నద్ధత చాటుతోంది. సుఖోయ్-30ఎంకేఐ, మిగ్-29 యుద్ధ విమానాల రొదతో సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి.

తమ అప్రమత్తత ఎలా ఉందో చూపించేందుకు భారత వాయుసేన కొందరు పాత్రికేయులను సరిహద్దుకు సమీపంలో ఉన్న ఎయిర్ బేస్ కు తీసుకెళ్లింది. నిరంతరం గాల్లో చక్కర్లు కొడుతున్న యుద్ధ విమానాలు పాత్రికేయులకు దర్శనమిచ్చాయి. యుద్ధ విమానాలే కాదు, అమెరికా తయారీ సి-17, సి-130జే, రష్యా తయారీ ఐఎల్-76, ఆంటోనోవ్-32 వంటి భారీ విమానాలు కూడా అదనపు దళాలను సరిహద్దుల వద్దకు తరలిస్తూ బిజీగా కనిపించాయి. కేవలం యుద్ధ అవసరాల కోసమే తయారైన అపాచీ హెలికాప్టర్లు కూడా గగనతలంలో సందడి చేశాయి.

మొత్తమ్మీద తూర్పు లడఖ్ లో ఉన్న ఆ ఎయిర్ బేస్ మొత్తం యుద్ధ వాతావరణంతో కోలాహలంగా మారింది. కాగా, మరికొన్ని రోజుల్లో ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు రానుండడంతో భారత రక్షణ రంగంలో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది.