Talasani: చాలామందికి కరోనా తెలియకుండానే వచ్చిపోతుంది: తలసాని

  • తెలంగాణలో కరోనా బీభత్సం
  • రాబోయే రోజుల్లో కరోనా కేసులు ఇంకా పెరుగుతాయన్న తలసాని
  • విపక్షాల విమర్శలను పట్టించుకోబోమని వెల్లడి
Talasani talks about corona situations in Telangana

రాబోయే రోజుల్లో తెలంగాణలో కరోనా కేసులు ఇంకా పెరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అయితే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కరోనా రోగుల చికిత్సకు తమ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. కేంద్రం, ఐసీఎంఆర్ కూడా తెలంగాణలో కరోనా నివారణ చర్యలను, రోగుల చికిత్స అంశాలను ప్రశంసిస్తుంటే, విపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ మాత్రం విమర్శలు చేస్తున్నాయని అన్నారు. కానీ తాము ఆ విమర్శలను పట్టించుకోబోమని అన్నారు.

"ఈ కరోనా వైరస్ అనేది నూటికి 75 శాతం వస్తుంది, పోతుంది. చాలామందిలో ఈ వైరస్ తెలియకుండానే వచ్చిపోతుంది. కొందరికి వైరస్ సోకినట్టు కూడా తెలియదు. ఇతర వ్యాధులతో బాధపడేవాళ్లపై ప్రభావం చూపుతుంది. మహమూద్ అలీ, వీహెచ్, పద్మారావు వంటి నేతలకు కరోనా రావడానికి వారి భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందే కారణమని భావిస్తున్నాం. వారి సిబ్బందికి కరోనా వచ్చిన విషయం కూడా తెలియదు. వారు టెస్టులు చేయించుకుంటే బయటపడేది. కానీ వారిలో ఏ లక్షణాలు లేవు. వర్షాకాలం వస్తుండడంతో మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉంది.

ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ నుంచి వెళ్లిపోవాల్సిన పనిలేదు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి. పాజిటివ్ వచ్చిన వాళ్లందరూ భయపడాల్సిన పనిలేదు. లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ విధించాలా? వద్దా? అన్న విషయం పరిశీలనలో ఉంది. త్వరలో నిర్ణయం తీసుకుంటాం" అని వివరణ ఇచ్చారు.

కరోనా విషయంలో తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. కానీ విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ చూస్తే... కాలువలకు గండి పడితే ప్రపంచమే బద్దలైనంతగా ప్రచారం చేస్తోందని, బీజేపీ వాళ్లేమో ఆసుపత్రుల ఎదురుగా ధర్నాలు చేస్తామంటారని ఆరోపించారు. తమ వద్ద చేసేదేదో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద చేస్తే బాగుంటుంది కదా? అని తలసాని హితవు పలికారు.

More Telugu News