ఇప్పటివరకు 17 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకింది: వైవీ సుబ్బారెడ్డి వెల్లడి

04-07-2020 Sat 14:13
  • టీటీడీలో కరోనా కలకలం
  • ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు విస్తృత చర్యలు తీసుకుంటామన్న వైవీ
  • ఇకపై టీవీ లైవ్ లో టీటీడీ సమావేశాలు
YV Subba Reddy said seventeen TTD employs got infected by corona

తిరుమల పుణ్యక్షేత్రంలోనూ కరోనా కలకలం అంటూ ఇటీవల మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. ఇవాళ తిరుమలలో ధర్మకర్తల మండలి సమావేశం సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దీని గురించి మాట్లాడారు. 17 మంది టీటీడీ ఉద్యోగులు కరోనా బారినపడ్డారని వివరించారు. టీటీడీ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని దర్శనాలపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. భక్తుల సంఖ్య పెంచకుండా ఇకపైనా ఇదే విధానం కొనసాగిస్తామని వెల్లడించారు. కరోనా కష్టకాలంలో ఆదాయ, వ్యయాల గురించి చూడడంలేదని, భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.  అంతేగాకుండా, బోర్డు సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇకపై అన్ని బోర్డు సమావేశాలను ఎస్వీబీసీ చానల్ ద్వారా టీవీ లైవ్ ఇవ్వనున్నట్టు చెప్పారు.