Telangana: రోజుకు వెయ్యిమంది.. లాక్‌డౌన్‌ భయంతో ఏపీకి తరలుతున్న జనం!

  • హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారన్న వదంతులు
  • పెద్ద ఎత్తున రాష్ట్రానికి తరలుతున్న ఏపీ వాసులు
  • సరిహద్దుల వద్ద కోలాహలం
AP People leaving Hyderabad amid lockdown fear

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. రోజుకు వెయ్యి మంది చొప్పున సరిహద్దు దాటుతున్నారు. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారన్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో సరిహద్దుల వద్ద సందడి నెలకొంది. ‘స్పందన’, ‘ఈ-పాస్’, ‘ఆధార్’, ఇతర గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన అనంతరం అధికారులు రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. అనుమతి పత్రాలు లేని వారిని మాత్రం వెనక్కి పంపుతున్నారు.

థర్మల్ స్క్రీనింగ్ అనంతరం చేతిపై ‘హోం క్వారంటైన్’ ముద్ర వేస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే వీరిని అనుమతిస్తున్నారు. మరోవైపు, ఈ-పాస్‌లు ఉన్నవారే రాష్ట్రానికి రావాలని, లేని వారు వచ్చి ఇబ్బందులు పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. కాగా, గత నెల 24 నుంచి 26 మధ్య రోజుకు సగటున 800 మంది ఏపీకి రాగా, ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం ఈ సంఖ్య వెయ్యి దాటింది. 29న 1,044 మంది రాష్ట్రానికి రాగా, 30న 1,088 మంది, ఈ నెల 1న 1,130 మంది ఏపీలోకి ప్రవేశించినట్టు అధికారులు తెలిపారు. అలాగే, 15 రోజుల క్రితం రోజుకు సగటున 300 వాహనాలు ఏపీలోకి రాగా, ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపు అయింది.

More Telugu News