ఇప్పుడిక అధికారికం.. ఫెయిర్ అండ్ లవ్లీ ఇక ‘గ్లో అండ్ లవ్లీ’

03-07-2020 Fri 08:31
  • పేరు మార్పును ప్రకటించిన హెచ్‌యూఎల్
  • గ్లో అండ్ హ్యాండ్‌సమ్ పేరుపై పోటీ సంస్థ ఇమామీ అభ్యంతరం
  • తెలుపు అనే పదాలను తొలగిస్తున్న కంపెనీలు
Fair and lovely now Glow and lovely

ఫేస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ పేరును మారుస్తున్నట్టు గత కొంతకాలంగా వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. ఈ క్రీం పేరును ‘గ్లో అండ్ లవ్లీ’గా మార్చినట్టు దాని తయారీ సంస్థ హిందూస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) నిన్న ప్రకటించింది. ఇకపై వచ్చే ఉత్పత్తులన్నీ ఈ పేరుతోనే మార్కెట్లోకి వస్తాయని పేర్కొంది. అందం విషయంలో సానుకూల దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మార్పు చేసినట్టు వివరించింది. అలాగే, పురుషుల కోసం అందుబాటులో ఉన్న క్రీం ‘ఫెయిర్ అండ్ హ్యాండ్‌సమ్’ పేరును ఇకపై ‘గ్లో అండ్ హ్యాండ్‌సమ్‌’గా మార్చినట్టు తెలిపింది.

ఫెయిర్ అండ్ లవ్లీలో ఫెయిర్ అనే పదాన్ని తొలగిస్తున్నట్టు హెచ్‌యూఎల్ గత నెలలోనే ప్రకటించింది. చర్మాన్ని తెల్లగా మార్చే సౌందర్య ఉత్పత్తులు వర్ణ వివక్షలో భాగమేనన్న చర్చ ఇటీవల జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేసే జాన్సన్ అండ్ జాన్సన్ చర్మాన్ని తెల్లగా మార్చే ఉత్పత్తుల విక్రయాలను అమెరికాలో ఇప్పటికే నిలిపివేసింది. మరోవైపు,  ఫ్రెంచ్‌ కంపెనీ ఎల్‌ఓరియల్‌ గ్రూపు కూడా తమ ఉత్పత్తుల నుంచి వైట్, వైటెనింగ్‌ అనే పదాలను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హెచ్‌యూఎల్ కూడా ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, పురుషుల క్రీం పేరును ‘గ్లో అండ్ హ్యాండ్‌సమ్’గా మార్చడంపై ఇమామీ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే అదే పేరుతో తమ ఉత్పత్తి ‘ఇమామీ గ్లో అండ్ హ్యాండ్‌సమ్’ ఉందని పేర్కొంది.