పబ్ జీని బ్యాన్ చేస్తూ పాక్ సంచలన నిర్ణయం

02-07-2020 Thu 17:39
  • పబ్జీ గేమ్ తో ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువకులు
  • బ్యాన్ చేయాలంటూ పాక్ లో చాలా కాలంగా డిమాండ్లు
  • ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన లాహోర్ హైకోర్టు
Pakistan bans PubG game

పొరుగు దేశం పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రాచుర్యం పొందిన పబ్జీ గేమ్ ను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ టెలి కమ్యూనికేషన్ అథారిటీ ప్రకటించింది. పబ్జీ గేమ్ ఒక వ్యసనమని... దాని వల్ల సమయం వృథా అవుతుందని తెలిపింది. పబ్జీ గేమ్ చిన్నారులు, యువతను ఆత్మహత్యల దిశగా ప్రేరేపిస్తోందని, దాన్ని బ్యాన్ చేయాలనే డిమాండ్ పాక్ లో చాలా కాలంగానే వినిపిస్తోంది.

మిషన్ పూర్తి చేయడంలో విఫలం కావడంతో... 16 ఏళ్ల పాకిస్థాన్ బాలుడు ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ గేమ్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్లు మరింత పెరగడమే కాక, లాహోర్ హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు... దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో, ఈ గేమ్ ను తాత్కాలికంగా బ్యాన్ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది.