China: చైనా కంపెనీలపై ఉక్కుపాదం.. రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను అనుమతించబోమన్న కేంద్రం!

  • చైనా కంపెనీలు భాగస్వాములుగా ఉన్న జాయింట్ వెంచర్లను కూడా అనుమతించం
  • చైనా భాగస్వామ్యం ఉన్న పనులకు రీబిడ్డింగ్ నిర్వహిస్తాం
  • పోర్టుల్లో చైనా దిగుమతులపై నిఘాను పెంచాం
Chinese firms not allowed in Road projects says Nitin Gadkari

చైనా యాప్ లను నిషేధించి ఆ దేశానికి ఇప్పటికే షాకిచ్చిన భారత ప్రభుత్వం... మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. దేశంలో చేపడుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను కానీ, ఆ దేశ కంపెనీల భాగస్వామ్యాన్ని కానీ అనుమతించబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈ కంపెనీల్లో కూడా చైనాను అనుమతించబోమని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా కంపెనీలు భాగస్వామిగా ఉన్న జాయింట్ వెంచర్లను కూడా అనుమతించబోమని తెలిపారు. ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

జాతీయ రహదారులకు సంబంధించి కొత్త పాలసీని తీసుకొస్తున్నామని... మన దేశ కంపెనీలకు ప్రాజెక్టు నిర్మాణాల్లో ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పిస్తామని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో చైనా కంపెనీల భాగస్వామ్యం ఉన్నట్టైతే... రీబిడ్డింగ్ నిర్వహిస్తామని చెప్పారు. సాంకేతిక, ఆర్థిక నిబంధనలను దేశీయ సంస్థల కోసం సడలించాలని జాతీయ రహదారుల సెక్రటరీ గిరిధర్, చైర్మన్ సంధూలకు సూచించానని... త్వరలోనే దీనిపై సమావేశాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు.

మన దేశానికి విదేశీ టెక్నాలజీ అవసరమైన సందర్భాల్లో కూడా చైనా పెట్టుబడిదారులను అనుమతించబోమని గడ్కరీ చెప్పారు. చైనా నుంచి వస్తున్న దిగుమతులపై చెన్నై, విశాఖపట్నం పోర్టుల్లో కస్టమ్స్ నిఘాను ముమ్మరం చేశామని తెలిపారు.

More Telugu News