Telangana: జీవించే హక్కును కాలరాసేలా వ్యవహరిస్తున్నారు: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

TS high court anger on govt on corona tests
  • కరోనా టెస్టుల నిర్వహణపై ఆగ్రహం
  • ఎన్ని టెస్టులు చేశారో చెప్పాలంటూ ఆదేశం
  • అధికారులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరిక
తెలంగాణలో నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవించే హక్కును కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడింది. 10 నిమిషాల్లో ఫలితం తేలే పరీక్షలను నిర్వహించాలని గతంలోనే ఆదేశించామని... ఇప్పటి వరకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. మూడు రోజుల నుంచి టెస్టులు చేయడం లేదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో.. ప్రభుత్వ వైఖరి పట్ల హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని టెస్టులు చేశారు, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారని ప్రశ్నించింది.

ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం ఎక్కడెక్కడ పర్యటించిందో ఈనెల 17వ తేదీన తెలపాలని హైకోర్టు ఆదేశించింది. జూన్ 26న టెస్టులను ఎందుకు ఆపేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. 50 వేల టెస్టులు చేస్తామని చెప్పి... చేయకపోవడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని చెప్పింది. డాక్టర్లకు, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్స్ ఎన్ని ఇచ్చారో చెప్పాలని ఆదేశించింది. ఏప్రిల్ 21, జూన్ 8, జూన్ 18న ఎన్నెన్ని కిట్స్ ఇచ్చారో చెప్పాలని అడిగింది. తదుపరి విచారణలో వీటి వివరాలను సమర్పించకపోతే అధికారులు కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Telangana
TS High Court
Corona Virus
Tests

More Telugu News