Donald Trump: ట్రంప్ నిర్ణయంతో ఇండియాకు వచ్చి ఇరుక్కుపోయిన వారి బాధ వర్ణనాతీతం!

  • వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు తిరిగి వెళ్లలేని పరిస్థితి
  • వీసాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తెచ్చిన ట్రంప్
  • వేలాది మందిని అడ్డుకుంటున్న కఠిన నిర్ణయాలు
Many Visa Holders Stuck up after Trump Executive Order

నటాషా భట్... అమెరికాలో చెల్లుబాటయ్యే వీసా కలిగివుండి, అక్కడే బతుకుతున్న 35 ఏళ్ల మహిళ. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తన తాతయ్య చనిపోయాడన్న వార్త విని, నాలుగేళ్ల కొడుకుని, కేవలం ఓ బ్యాక్ ప్యాక్ వేసుకుని శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టుకు అర్ధరాత్రిపూట బయలుదేరింది. ఇండియాకు ఆమె విమానమైతే ఎక్కి స్వస్థలానికి చేరుకుందిగానీ, తిరిగి ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాల్సి వస్తుందని ఆమెకు తెలియదు. హెచ్-1బీ వీసాను కలిగివుండి, సిలికాన్ వ్యాలీలోని ఓ టెక్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె, వీసా డాక్యుమెంట్లు ఇప్పటికీ రెన్యువల్ కాలేదు. కొన్ని వారాల్లో తిరిగి బిడ్డ దగ్గరకు వెళతానని ఆమె అనుకుందే తప్ప, లాక్ డౌన్, విదేశీ విమానాల రద్దు, ఆపై అమెరికా ప్రభుత్వం వీసాలపై కఠిన నిర్ణయాలు ఆమెను అడ్డుకున్నాయి. 

తాజాగా ట్రంప్ 2021 వరకూ హెచ్-1బీ వీసాదారులు సహా పలు రకాల ఇతర వీసాలను కలిగివున్నవారిని అమెరికాలోకి రానిచ్చేది లేదంటూ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నటాషా పట్ల అశనిపాతమైంది. ఈ సమస్య ఒక్క ఆమెదే కాదు. వీసాల రద్దుతో అటు అమెరికాలో, ఇటు ఇండియాలో ఎంతో మంది టెక్నాలజీ నిపుణులపై ప్రభావం పడింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ట్రంప్ పలుమార్లు ఇమిగ్రేషన్ వ్యతిరేక లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారని, ఇప్పుడు కరోనా మహమ్మారి ఆయనకీ కలిసొచ్చిందని వీసా రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టెక్నాలజీ రంగంలో విధులను నిర్వహిస్తున్న కొన్ని వేల మంది భారత టెక్కీలు, ఇప్పుడు తమ వీసాలు ఏమైపోతాయోనన్న తీవ్ర ఆందోళనతో ఉన్నారు. వాస్తవానికి వీరందరి భయాలూ ట్రంప్ అధ్యక్ష పీఠంపైకి ఎక్కగానే మొదలయ్యాయి. ఎంతో మంది అమెరికాకు, స్వదేశానికీ మధ్య ఉండిపోయి, ఎటూ వెళ్లలేకపోతున్నారు. అమెరికాలోనే ఉన్నవారిలో ఇండియాకు వెళితే, తిరిగి రాలేమన్న ఆందోళన నెలకొనగా, ఇక్కడికి ముందే వచ్చిన వారు తిరిగి వెళ్లలేని పరిస్థితి.

ఇక కొన్ని వందల మంది ఇండియాలో జరగాల్సిన తమ వివాహాలను వాయిదా వేసుకోగా, మరెంతో మంది తమవారు మరణించారని తెలిసినా చివరి చూపులకు రాలేకపోయారు. కొన్ని రకాల వీసాలకు అమెరికాను వదిలేముందు కొంత పేపర్ వర్క్ ను పూర్తి చేయాల్సి వుంటుంది. అదే జరిగితే, వారు దేశం విడిచి వెళ్లినట్టే. వారు తిరిగి రావడానికి తిరిగి అమెరికా ఇమిగ్రేషన్ అనుమతి పొందాల్సివుంటుంది. ఇదే ఇప్పుడు వేలమందిలో భయాన్ని రేపుతోంది. 

దాదాపు 3.75 లక్షల మందికి పైగా యూఎస్ తాత్కాలిక వీసాలు ఉన్నవారు, గ్రీన్ కార్డు హోల్డర్లు ఇప్పటికిప్పుడు తిరిగి యూఎస్ లోకి ప్రవేశించే పరిస్థితులు లేవు. ప్రస్తుతం ఇండియాలో ఉండిపోయిన వారిలో అత్యధికులు సిలికాన్ వ్యాలీతో ఏదో ఒక విధంగా సంబంధం ఉన్నవారేనని మైగ్రేషన్ పాలసీ ఇనిస్టిట్యూట్ సీనియర్ పాలసీ అనలిస్ట్ జూలియా గెలాట్ అభిప్రాయపడ్డారు. వీరందరిలో ఇప్పుడు భయాలు నెలకొని వున్నాయని ఆమె అన్నారు. 

కాగా, నటాషాతో వచ్చిన ఆమె భర్త తన విధుల నిమిత్తం మార్చి ప్రారంభంలోనే యూఎస్ కు చేరుకుని, నాలుగు నెలల నుంచి అక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న నటాషా, తమ సంస్థ యూఎస్ క్లయింట్ల కోసం రాత్రంతా పనిచేస్తూ,  తన బిడ్డకు భారత ఆహారాన్ని అలవాటు చేసేందుకు నానా అవస్థలూ పడుతోంది. ఇక్కడ లభించే చపాతీలు తినలేకపోతున్నాడని, కాలిఫోర్నియాలో అల్పాహారంగా అందరూ తినే అవొకాడో టోస్ట్ ను తాను ఇవ్వలేకపోతున్నానని ఆమె వాపోయింది. 

ఇక ఇదే తరహా సమస్యలను ఎదుర్కొంటున్న వారంతా ఒకతాటిపైకి రావాలన్న ప్రయత్నం మొదలైంది. ట్రంప్ ఆదేశాలు అమల్లోకి రాకముందే ఇటువంటి పరిస్థితి ఏర్పడవచ్చని భావించిన సిస్కిండ్ అనే వ్యక్తి, తన ట్విట్టర్ ఖాతా ద్వారా నాన్ ఇమిగ్రెంట్ వీసాలు ఉన్నవారు ఎవరూ యూఎస్ ను దాటి వెళ్లవద్దని హెచ్చరించాడు. వెళితే సాధ్యమైనంత త్వరగా వచ్చేయాలని సూచించాడు. ఇప్పుడిక ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం పెట్టడంతో బాధితుల దీన గాథలను సేకరించే పని మొదలు పెట్టాడు.

ఈ పని ప్రారంభించిన 24 గంటల వ్యవధిలోనే 500 మందికిపైగా స్పందించడం గమనార్హం. తన వివాహం నిమిత్తం ఇండియాకు వచ్చి, చిక్కుకుపోయిన శాస్త్రవేత్త, తన బిడ్డ ఆరోగ్యం బాగాలేదంటే స్వదేశానికి వెళ్లిన అట్లాంటాలోని ఓ ఐటీ సంస్థ ఉద్యోగి, ఓ ప్రాజెక్టు నిమిత్తం ఇండియాకు రావాలని ఆదేశిస్తే వచ్చిన మరో ఉద్యోగి... ఇలా ఎంతో మంది తమ వాస్తవ గాథలను పంచుకున్నారు. వీరందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు సోషల్ మీడియా సహకరిస్తుందని నమ్ముతున్నానని సిస్కిండ్ అంటున్నారు.

More Telugu News