Cyber Attack: రెచ్చిపోతున్న చైనా హ్యాకర్లు... భారత సైట్లపై మూడు రెట్లు పెరిగిన సైబర్ దాడులు!

  • గాల్వాన్ ఘటన తరువాత పెరిగిన దాడులు
  • హ్యాకర్లకు చైనా ప్రభుత్వం, ఆర్మీ సాయం
  • కీలక సమాచారాన్ని దొంగిలిస్తున్నారన్న సింగపూర్ సంస్థ
China Hackers Eye on Indian Sites

గాల్వాన్ లోయలో ఈ నెల 15న భారత్, చైనా మధ్య ఘర్షణల తరువాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మద్దతు ఉన్న హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఈ రెండు వారాల వ్యవధిలో భారత వెబ్ సైట్లపై జరుగుతున్న దాడులు 300 శాతం వరకూ పెరిగాయని సింగపూర్ కు చెందిన సైబర్ రీసెర్చ్ పేర్కొంది. చైనా హ్యాకర్ల దాడులు భారీ స్థాయిలో పెరిగాయని సంస్థ సీఎండీ రితేశ్ కుమార్ తెలిపారు. ఈ సమాచారాన్ని తాము భారత ప్రభుత్వ సీఈఆర్టీ (కంప్యూటర్ అత్యవసర రెస్పాన్స్ టీమ్)తో పంచుకున్నామని అన్నారు.

చైనా హ్యాకర్లంతా తొలుత వెబ్ సైట్లపై దృష్టిని పెడుతున్నారని, ఆపై కీలక సమాచారం సేకరించి, టార్గెట్ ను ఎంచుకుంటున్నారని, దాని తరువాత దాడులకు దిగుతున్నారని ఆయన అన్నారు. గత నెల 18వ తేదీకి ముందు రియల్ ఎస్టేట్, మీడియా, ప్రభుత్వ రంగ ఏజన్సీలు, స్మార్ట్ ఫోన్లు తదితర వెబ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు, ఆ తరువాత పేట్రేగిపోయారని, సంస్థల పరువు తీయడం, మేధో హక్కులను దొంగిలించడం, ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించడం, వినియోగదారుల వివరాలు సేకరించడం వంటి పనులు చేస్తున్నారని ఆయన అన్నారు.

గతంలో పాకిస్థాన్, ఉత్తర కొరియాలకు చెందిన హ్యాకర్ల ద్వారా దాడులు జరిపించిన చైనా హ్యాకర్లు, ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగారని రితేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. చైనా రాజధాని బీజింగ్ తో పాటు గ్వాంగ్ ఝో, షెన్ జన్, చెంగ్డూ తదితర నగరాల నుంచి ఈ దాడులు జరుగుతున్నట్టు తమ రీసెర్చ్ లో తేలిందని, దీనికి చైనా ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోందని అన్నారు. చైనా ఆర్మీకి చెందిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను వినియోగించుకుంటున్న గోధిక్ పాండా, స్టోన్ పాండా హ్యాకింగ్ ఏజన్సీలు, గతంలో యూఎస్, యూరప్ తదితర దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుండేవని, ఇప్పుడు చైనా నుంచే దాడులు జరుగుతున్నాయని తెలిపారు. వీరు మాట్లాడుకునే మాటలను డీకోడ్ చేయగా, ఇండియాకు గుణపాఠం చెప్పాలన్నదే వీరి లక్ష్యంగా ఉందని అర్థమవుతోందని రితేశ్ వ్యాఖ్యానించారు.

More Telugu News