Medha Raj: జో బిడెన్ ప్రచార దళంలో భారత సంతతి మహిళకు కీలక పదవి

  • అమెరికాలో జోరుగా ఎన్నికల ప్రచారం
  • డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి అభ్యర్థిగా జో బిడెన్
  • మేధా రాజ్ కు డిజిటల్ చీఫ్ గా బాధ్యతలు
Medha Raj appointed as Joe Biden campaign digital chief

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్న జో బిడెన్ తన ప్రచార విభాగాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భారత సంతతి నిపుణురాలు మేధా రాజ్ ను తన ప్రచార దళం డిజిటల్ చీఫ్ గా నియమించారు. అమెరికాలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రచారం అత్యధికంగా ఆన్ లైన్ లోనే సాగుతోంది. దాంతో సోషల్ మీడియాపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.

ఇప్పుడు జో బిడెన్ శిబిరంలో డిజిటల్ చీఫ్ గా నియమితురాలైన మేధా రాజ్... ఆయన ఆలోచనలు, మేనిఫెస్టోను అత్యధిక సంఖ్యలో ప్రజలకు చేర్చాల్సి ఉంటుంది. అందుకోసం, అన్ని డిజిటల్ సమాచార వేదికలను సమన్వయం చేసుకోవడం ఆమె ప్రధాన బాధ్యత. దీనిపై మేధా రాజ్ స్పందిస్తూ, జో బిడెన్ ఎన్నికల ప్రచార విభాగంలో డిజిటల్ చీఫ్ గా బాధ్యతలు అందుకున్నానని, ఎన్నికలకు మరో 130 రోజులే ఉన్నందున ఇక మీదట ఒక్క నిమిషం కూడా వృథా చేయదలచుకోలేదని తెలిపారు. మేధా రాజ్ జార్జ్ టౌన్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.

More Telugu News