College Graduates: 66 శాతం మంది విద్యార్థులకు జాబ్ ఆఫర్లు లేవు: జాబ్ పోర్టల్ 'నౌక్రీ'

  • 1300 మంది విద్యార్థులపై సర్వే చేసిన నౌక్రీ
  • విద్యార్థుల ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపిన కరోనా
  • ఆన్ లైన్ కోర్సులపై మొగ్గు చూపుతున్న విద్యార్థులు
66 percent of campus graduates do not have job offers says Naukri

కాలేజీ క్యాంపస్ ల నుంచి బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లలో 66 శాతం మందికి జాబ్ ఆఫర్ లెటర్లు లేవని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌక్రీ (naukri.com) తెలిపింది. మూడింట ఒక్క వంతు విద్యార్థులు ఆఫర్ లెటర్లు అందుకున్నారని చెప్పింది. 1,300 మంది కాలేజీ విద్యార్థులపై చేసిన సర్వే ఆధారంగా నౌక్రీ ఈ వివరాలను వెల్లడించింది. 9 శాతం మంది విద్యార్థులకు జాయినింగ్ తేదీ ఖరారయిందని.. మిగిలిన వారికి జాయినింగ్ డేట్ ఇంకా ఖరారు కాలేదని పేర్కొంది.

మెజారిటీ విద్యార్థులు ఉద్యోగాల కోసం జాబ్ పోర్టల్స్ ను ఆశ్రయిస్తున్నారని నౌక్రీ తెలిపింది. 17 శాతం విద్యార్థులు కాలేజీల్లోనే ఉద్యోగాలను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించింది. కొందరు విద్యార్థులు ఫ్రీలాన్సింగ్ వైపు మొగ్గు చూపుతున్నారని, తమ కెరీర్ ను ఈ మార్గంలోనే కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పింది.

2020 బ్యాచ్ కు సంబంధించి 82 శాతం కాలేజీల విద్యార్థుల భవిష్యత్తుపై కరోనా మహమ్మారి ప్రభావం చూపిందని తెలిపింది. 74 శాతం మంది ఫైనలియర్ విద్యార్థుల ఇంటర్న్ షిప్ ఆఫర్లను ప్రభావితం చేసిందని చెప్పింది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ విద్యార్థులు ధైర్యాన్ని కోల్పోలేదని... వర్చువల్ మీడియా ఆధారంగా కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని... ఇంటర్వ్యూలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. సుదూర ప్రాంతంలో ఉన్న విద్యార్థులను హైర్ చేసుకోవడానికి కంపెనీలు కూడా సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నాయని పేర్కొంది.

ఆన్ లైన్ కోర్సులు, సర్టిఫికేషన్లకు ఫ్రెషర్లు మొగ్గుచూపుతున్నారని నౌక్రీ పేర్కొంది. 70 శాతం మంది విద్యార్థులు ఇప్పటికే ఆన్ లైన్ కోర్సులకు సబ్ స్క్రైబ్ అయ్యారని తెలిపింది. వీరిలో సగం మంది తాము చదివిన విభాగాలకు సంబంధించి కొత్త విషయాలను తెలుసుకునేందుకు వార్తలు చదువుతున్నారని వెల్లడించింది. విద్యార్థుల ఉన్నత విద్య ఆలోచనలపై కరోనా ప్రభావం ఏమాత్రం లేదని చెప్పింది.

More Telugu News