OTT: ఓటీటీ వేదికల్లో పండగే పండగ... డిస్నీ హాట్ స్టార్ లో 7 పెద్ద సినిమాలు రిలీజ్

Big movies set to release in OTT due to corona pandemic
  • లాక్ డౌన్ తో మూతపడిన థియేటర్లు
  • విడుదలకు నోచుకోని కొత్త చిత్రాలు
  • ఓటీటీలో విడుదలకు సిద్ధపడుతున్న నిర్మాతలు
నిన్నమొన్నటి దాకా ఓ మోస్తరుగా ప్రస్థానం సాగించిన ఓటీటీ (ఓవర్ ది టాప్) వినోద రంగం ఇప్పుడు జెట్ స్పీడుతో వెళుతోంది. అందుకు కారణం కరోనా వైరస్. కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలైనా ఓటీటీ వేదికలు మాత్రం కళకళలాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితుల్లో సినిమా థియేటర్లు మూతపడడంతో కొత్త సినిమాల విడుదల అగమ్యగోచరంగా మారింది. దాంతో చేసేది లేక నిర్మాతలు తమ కొత్త చిత్రాలను నేరుగా ఓటీటీ వేదికల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో డిస్నీ హాట్ స్టార్ వేదికగా 7 పెద్ద సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. వీటిలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన 'దిల్ బేచారా', అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'లక్ష్మీ బాంబ్' కూడా ఉన్నాయి. ఇవేకాదు, అజయ్ దేవగణ్ నటించిన 'భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా', యువ హీరో విద్యుత్ జమ్వాల్ కొత్త సినిమా 'ఖుదా హఫీజ్', సీనియర్ దర్శకుడు మహేశ్ భట్ మళ్లీ దర్శకత్వ బాట పడుతూ తెరకెక్కించిన చిత్రం 'సడక్-2' (అలియా భట్, సంజయ్ దత్), అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ పోషించిన 'ద బిగ్ బుల్', యువ నటుడు కునాల్ ఖేమూ నటించిన 'లూట్ కేస్' త్వరలోనే డిస్నీ హాట్ స్టార్ లో కనువిందు చేయనున్నాయి.

థియేటర్లు ఎప్పుడో తెరుస్తారో తెలియని పరిస్థితుల్లో నష్టాల పాలయ్యేకంటే, వచ్చినదాంతో సంతృప్తి పడి ఓటీటీల్లో తమ చిత్రాలను రిలీజ్ చేసుకోవడమే మేలని నిర్మాతలు భావిస్తున్నారు.
OTT
Movies
Release
Lockdown
Corona Virus

More Telugu News