Rafale: సరైన సమయంలో సరైన అస్త్రం... వచ్చే నెలలో భారత్ కు రాఫెల్ యుద్ధ విమానాల రాక

Rafale jet fighters from France will be delivered next month
  • సరిహద్దుల్లో పెరిగిన సైనిక మోహరింపులు
  • ఆరు రాఫెల్ విమానాలు పంపాలని ఫ్రాన్స్ ను కోరిన భారత్
  • అంగీకరించిన ఫ్రాన్స్
తూర్పు లడఖ్ వద్ద వాస్తవాధీన రేఖ ప్రాంతం ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉంది. సైనిక పరమైన చర్చలు జరుగుతూనే ఉన్నా, మరోవైపున వ్యూహాత్మక మోహరింపులు ముమ్మరం అయ్యాయి. చైనా తన అత్యాధునిక జెట్ యుద్ధ విమానాలను సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తోంది. ఈ తరుణంలో భారత్ కు సరైన ఆయుధాలు చేతికి అందనున్నాయి. ఫ్రాన్స్ తయారీ రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చే నెలలోనే భారత్ కు రానున్నాయి.

ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే నెలలో 4 రాఫెల్ యుద్ధ విమానాలు రావాల్సి ఉండగా, ప్రస్తుతం చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో మొత్తం 6 విమానాలు పంపాలని భారత్ కోరింది. ఈ విజ్ఞప్తికి ఫ్రాన్స్ సానుకూలంగా స్పందించడం విశేషం.

రాఫెల్ యుద్ధ విమానాలకు అత్యాధునిక క్షిపణులు అమర్చి ఉంటాయి. గగనతలంలో రాఫెల్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే విమానాలు చాలా తక్కువ. చైనా వద్ద ఉన్న జేఎఫ్-17, జే-11, జే-8 ఫైటర్ విమానాలు కూడా సామర్థ్యం పరంగా ఉన్నతశ్రేణికి చెందినవే అయినా, రాఫెల్ కు అమర్చిన మెటియోర్, స్కాల్ప్ క్షిపణులు భారత్ కు కచ్చితంగా పైచేయి అందిస్తాయి.

బియాండ్ విజువల్ రేంజ్ (దృశ్య పరిధిని మించిన) లక్ష్యాలను ఛేదించడంలో మెటియోర్ క్షిపణులు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి కాగా, స్కాల్ప్ క్షిపణి స్థిరమైన లక్ష్యాలపైకి ముందస్తు పథకం ప్రకారం దాడులు చేసేటప్పుడు తిరుగులేని సామర్థ్యం ప్రదర్శిస్తుంది. వీటికితోడు రాఫెల్ లో కమ్యూనికేషన్ జామర్లు, ఇన్ ఫ్రారెడ్ సెర్చ్ వంటి అత్యాధునిక వ్యవస్థలు పొందుపరిచారు.
Rafale
Jet Fighter
India
China
France

More Telugu News