raghurama krishnam raju: సీఎం జగన్‌కు లేఖ ద్వారా సమాధానం చెప్పిన ఎంపీ రఘురామకృష్ణరాజు

  • సీ-ఓటర్ ఫలితాల్లో ఉత్తమ సీఎంగా 4వ స్థానం సాధించారు
  • మీకు నా అభినందనలు
  • విజయసాయిరెడ్డి  నుంచి నోటీసు అందింది
  • మరో పార్టీ లెటర్‌ హెడ్‌తో నోటీసు వచ్చింది
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పింది కదా
raghurama krishnam raju writes letter to  jagan

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చిన విషయంపై సీఎం జగన్‌కు నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణ రాజు సమాధానం చెబుతూ లేఖ రాశారు. ఈ సందర్భంగా జగన్‌పై ఆయన ప్రశంసలు కురిపించడం గమనార్హం. ఇటీవల వెల్లడైన సీ-ఓటర్ ఫలితాల్లో ఉత్తమ సీఎంగా నాలుగో స్థానం సాధించినందుకు గాను ఆయన శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మొదటి స్థానం సాధించాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ మధ్య విజయసాయిరెడ్డి  నుంచి నోటీసు అందిందని, దానిపై స్పందిస్తూ ఈ రోజు ఈ లేఖ రాస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. రిజిస్టరయిన పార్టీ కాకుండా తనకు మరో పార్టీ లెటర్‌ హెడ్‌తో నోటీసు వచ్చిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని ఆయన గుర్తుచేశారు. పలు సందర్భాల్లో ఈసీ తమ పార్టీకి రాసిన లేఖలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ఏ సందర్భంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్న పేరును వాడుకునేందుకు అవకాశం లేదని ఈసీ చెప్పిందని ఆయన తెలిపారు.

 తాను వెంకటేశ్వరస్వామికి గొప్ప భక్తుడినని చెప్పారు. స్వామివారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలను మాత్రమే తాను వివరించి చెప్పానని తెలిపారు. ఆస్తుల అమ్మకం విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మాత్రమే చెప్పానని అన్నారు. అంతేగానీ, తాను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. మిమ్మల్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో ఆయన జగన్ ను కోరారు.

More Telugu News