Jammu And Kashmir: వంట గ్యాస్ నిల్వలు పెంచుకోవాలని కశ్మీర్ ప్రభుత్వ ఆదేశాలు... చైనాతో యుద్ధం ఖాయమంటూ ప్రచారం!

Kashmir Govt Orders to Stock Coocking Gas Reserves for 2 Months
  • రెండు నెలలకు సరిపడా నిల్వలు ఉండాలి
  • చమురు కంపెనీలకు అత్యవసర ఆదేశాలు
  • రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ఆందోళన
చైనాతో అమీతుమీ తేల్చుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందా? అందుకు సిద్ధంగా ఉండాలని కశ్మీర్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కనీసం రెండు నెలలకు సరిపడినంత వంట గ్యాస్ ను నిల్వ చేసుకుని పెట్టుకోవాలని చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఎల్జీ, హెచ్పీ గ్యాస్ కంపెనీలను ఆదేశించింది. ఈ మేరకు 27వ తేదీన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల విభాగం డైరెక్టర్ పేరిట ఆదేశాలు వెళ్లాయి. వీటిని అత్యవసర ఆదేశాలుగా పరిగణించాలని కూడా అందులో పేర్కొనడంతో, చైనాతో యుద్ధం జరుగనుందన్న ప్రచారం మొదలైంది.

అయితే, ప్రజలు యుద్ధం గురించిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వర్షాకాలం రావడంతో, కశ్మీర్ లోయలో కొండ చరియలు విరిగిపడి, జాతీయ రహదారులను మూసివేయాల్సి వస్తుంది కాబట్టే, గ్యాస్ నిల్వలను పెంచుకోవాలని సూచించామని ప్రభుత్వ వర్గాలు అంటున్నా, ఇరు దేశాల మధ్యా నెలకొన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో ఏ క్షణమైనా, ఏదైనా జరుగవచ్చని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి.

ముఖ్యంగా చైనా పక్కా ప్లాన్ తో భారత సైనికులపై దాడికి వచ్చిందని, దాడికి ముందు రోజు సరిహద్దులకు మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్, పర్వతారోహకులను పంపిందని చైనా అధికార మీడియా స్వయంగా వెల్లడించిన తరువాత యుద్ధ భయాలు మరింతగా పెరిగాయి.
Jammu And Kashmir
Cooking Gas
China
Border

More Telugu News