కరెంటు బిల్లు చూసి నటి తాప్సీ షాక్..10 రెట్లు ఎక్కువగా వచ్చిందని మండిపాటు

29-06-2020 Mon 06:56
Actress Taapsee pannu shocked to see power bill
  • రూ. 36 వేలు వచ్చిన బిల్లును చూసి షాకైన తాప్సీ
  • ఎలాంటి కరెంటు అందించినందుకు ఇంత మొత్తం బిల్లు పంపారని ప్రశ్న
  • అదానీ సంస్థకు చురకలు

ఇటీవల కరెంటు బిల్లులు ఇస్తున్న షాక్ మామూలుగా లేదు. దేశంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు, సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు అందరూ కరెంటు ‘షాక్’ల బారినపడుతున్నారు. కొందరికి బిల్లులు వేలల్లో వస్తుంటే మరికొందరికి ఏకంగా లక్షల్లో వస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు ఇటీవల తమకొచ్చిన కరెంటు బిల్లులను సోషల్ మీడియాలో పెట్టి విద్యుత్ బోర్డులపై దుమ్మెత్తి పోశారు. తాజాగా, ఇప్పుడు నటి తాప్సీ కూడా అదే పని చేశారు. తనకు ఏకంగా 36 వేల రూపాయల బిల్లు వచ్చిందని వాపోయారు. సాధారణంగా తనకు వచ్చే బిల్లు కంటే ఇది పది రెట్లు ఎక్కువని పేర్కొన్నారు.

‘‘కరెంటు బిల్లు భారీగా వచ్చేందుకు నేనేమైనా ఇంట్లోకి కొత్త గృహోపకరణాలు ఏమైనా తెచ్చానా? మూడు నెలలపాటు ఇంట్లోనేగా ఉంది. ‘అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై’ మీరు ఎలాంటి కరెంటు అందించినందుకు ఇంత మొత్తంలో బిల్లు వేశారు?’’ అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఏప్రిల్‌లో రూ.4,390, మేలో రూ.3,850, జూన్‌లో ఏకంగా రూ.36 వేలు వచ్చినట్టు చూపిస్తున్న బిల్లులను కూడా పోస్టు చేశారు.

ప్రస్తుతం తన అపార్ట్‌మెంట్ ఖాళీగా ఉందని, ఖాళీగా ఉన్నదానికే అంత బిల్లు వస్తే, అందులో ఉండి ఉంటే ఇంకెంత బిల్లు వచ్చేదో అని తాప్సీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాప్సీ ట్వీట్‌కు స్పందించిన అదానీ సంస్థ ఓ సందేశాన్ని పంపినప్పటికీ అందులో ఉన్న లింకు పనిచేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. స్పందన బాగుంది కానీ సరైన లింకును పంపించి ఉంటే బాగుండేదంటూ సంస్థకు చురకలంటించారు.