ప్రముఖ గాయని ఎస్.జానకికి ఏమైంది..?

28-06-2020 Sun 22:08
  • ఎస్.జానకి ఇక లేరంటూ ప్రచారం
  • వివరణ ఇచ్చిన గాయని కుమారుడు
  • ఎస్.జానకి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నారని వెల్లడి
Rumors spreads about legendary singer S Janaki
కొన్ని దశాబ్దాలుగా సంగీత ప్రియులను తన గానామృతంతో ఓలలాడిస్తున్న ప్రముఖ గాయని ఎస్.జానకి ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో వదంతులు వస్తున్నాయి. ఎస్.జానకి ఇక లేరంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రముఖులు వివరణ ఇస్తున్నా గానీ, ఊహాగానాలకు అడ్డుకట్ట పడడంలేదు. ఈ నేపథ్యంలో ఎస్.జానకి కుమారుడు మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు.

ఎస్.జానకి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఆదివారం ఉదయం నుంచి ఆమె మరణ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నాయని తెలిపారు. కాగా, ఎస్.జానకి ఇక లేరన్న వార్తలు ఇప్పుడే కాదు గతంలోనూ వచ్చాయి. 2016, 2017లోనూ ఇలాగే పుకార్లు వ్యాప్తి చెందాయి. అప్పుడు కూడా కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు.