Pawan Kalyan: ఇతర వర్గాలను రెచ్చగొడుతూ కాపుల నోట్లో మట్టి కొడుతున్నారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan advocates for Kapu community on reservations issue
  • కాపుల అంశంపై మరోసారి స్పందించిన పవన్ కల్యాణ్
  • కాపు రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని వ్యాఖ్యలు
  • కాపులపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాపుల అంశంలో మరోసారి ఘాటుగా స్పందించారు. 56 ఏళ్లుగా కాపులు అన్యాయానికి గురవుతున్నారని, కాపులపై కపట ప్రేమ నటిస్తూ ఓట్లు దండుకుని అధికారంలోకి రావడం నేతలకు ఓ రాజకీయ క్రీడలా మారిందని విమర్శించారు. రాజ్యాంగపరంగా ఉన్న అవకాశాలను ఉపయోగించి తమను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చమని అడిగినప్పుడల్లా... ముందు నుంచి 'సై' అంటూ వెనుక నుంచి 'నై' అంటున్నారని మండిపడ్డారు. పరోక్షంగా ఇతర వర్గాలను రెచ్చగొడుతూ కాపుల నోట్లో మట్టికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొన్ని వర్గాలకు కాపులు ఆర్థికంగా బలపడడం ఇష్టంలేదని, అందుకే కాపు రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని పవన్ ఆరోపించారు. 2014 ఎన్నికల వేళ టీడీపీ, వైసీపీ రెండూ కూడా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారని వెల్లడించారు. అనంతరం చంద్రబాబు సర్కారు కాపుల పరిస్థితిని అంచనా వేయడానికి మంజునాథ కమిషన్ వేసిందని తెలిపారు. కాపులు బీసీ జాబితాలో చేరేందుకు అర్హులేనని ఆ కమిషన్ చెప్పడంతో కాపులను బీసీ ఎఫ్ కేటగిరీలో చేర్చారని, వారికి విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ, శాసనమండలిలో బిల్లు ఆమోదించారని వివరించారు.

ఆ బిల్లును తదుపరి ఆమోదం కోసం కేంద్రానికి పంపారని, అయితే ఈ విషయాన్ని కాపు పెద్దలు, మేధావులు తప్పుబట్టారని పవన్ పేర్కొన్నారు.  చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మహారాష్ట్ర తరహాలో మరింత ఎక్కువగా రిజర్వేషన్ కల్పించి ఉండేవారని, అలా చేయకుండా బిల్లును కేంద్రానికి పంపి కాపుల ఆకాంక్షను పరోక్షంగా అటక ఎక్కించారని కాపులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.




Pawan Kalyan
Kapu
Reservations
Chandrababu
Jagan
Andhra Pradesh

More Telugu News