USA: చైనాతో ఇండియాకు ప్రమాదం... మా సైన్యాన్ని పంపే విషయమై ఆలోచిస్తున్నాం: అమెరికా కీలక ప్రకటన!

  • చైనా సైన్యంతో ఎన్నో దేశాలకు ముప్పు
  • గ్లోబల్ ఫోర్స్ ను నియమించే విషయమై సమీక్ష
  • క్షేత్ర స్థాయిలో రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటాం
  • యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో
Mike Pompeo Says US to review to Deploy Global Force at India china Border

చైనా లిబరేషన్ ఆర్మీతో పలు ఆసియా దేశాలకు ముప్పు ఉందని భావిస్తున్న, అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ తమ సైన్యాన్ని మోహరించే దిశగా పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

చైనా సైన్యంతో ఇండియాకు ప్రమాదం పొంచివుందని వ్యాఖ్యానించిన ఆయన, ఇండియాతో పాటు మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర ఆసియా దేశాలకు ముప్పు ఉందని అన్నారు. గురువారం నాడు జర్మన్ మార్షల్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన వర్చ్యువల్ బ్రసెల్స్ ఫోరమ్ 2020లో పాల్గొన్న ఆయన, ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

"చైనా సైన్యాన్ని నిలువరించేందుకు పలు దేశాలలో ఆర్మీని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నాం. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయా దేశాలకు మద్దతిచ్చేలా ఆలోచిస్తున్నాం. ఈ విషయమై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు సమీక్షలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే జర్మనీలోని మా సైన్యాన్ని 52 వేల నుంచి 25 వేలకు తగ్గించాం" అని మైక్ పాంపియో వెల్లడించారు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షించిన తరువాతనే తీసుకుంటామని ఆయన అన్నారు.

"కొన్ని ప్రాంతాల్లో అమెరికా వనరులు తక్కువగానే ఉన్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా కొన్ని దేశాలకు ప్రమాదం పొంచివుంది. ఇండియా సహా పలు దేశాలు ఈ ముప్పు అంచున ఉన్నాయి. కొన్ని దేశాలు తమను తాము రక్షించుకునే ప్రయత్నాలు చేయడం లేదు. ఆ పరిస్థితి మారాలి. వారు ముందుకు వస్తే, మా వంతు సాయం చేస్తాం. ఈ విషయంలో ప్రపంచంలోని అందరు భాగస్వామ్య దేశాలను, యూరప్ స్నేహితులతోనూ సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం" అని మైక్ పాంపియో తెలిపారు.

ప్రపంచంలో ఎక్కడెక్కడ గ్లోబల్ ఫోర్స్ ను నియమించాలన్న విషయమై సమీక్షలు నిర్వహించి చాలా కాలమైందని గుర్తు చేసిన ఆయన, దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం జరిపిన రివ్యూ తరువాత మరోసారి సమీక్షించలేదని, ఇప్పుడు పరిస్థితులు మారాయని ఆయన అన్నారు.

More Telugu News