Cab Driver: లాక్ డౌన్ తో ఉపాధి పోవడంతో చెరుకు రసం అమ్ముకుంటున్న క్యాబ్ డ్రైవర్

  • ప్రపంచ గతిని మార్చివేసిన కరోనా
  • కొత్త ఉపాధి బాట పడుతున్న వ్యక్తులు
  • అలవాటు లేని పనుల్లో రాణించలేక నష్టాలు
Cab driver selling sugar cane juice due to corona lock down

కరోనా మహమ్మారి రాకతో ప్రపంచం రూపురేఖలు మారిపోయాయనడంలో సందేహంలేదు. అనేకమంది ఉపాధి లేక తీవ్ర కష్టాలపాలవుతున్నారు. మరికొందరు కుటుంబ పోషణ కోసం ఏదో ఒక పనిచేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. ఒకప్పుడు ఓలా, ఊబెర్ వంటి సంస్థల తరఫున క్యాబ్ నడుపుకుంటూ గణనీయమైన స్థాయిలో ఆదాయం పొందిన డ్రైవర్లు ఇప్పుడు లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయారు.

హైదరాబాదులోని ఉప్పల్ కు చెందిన నాగేశ్ కుమార్ (36) ఓ క్యాబ్ డ్రైవర్. ఇప్పుడు పనిలేకపోవడంతో బతుకు దెరువు కోసం తన క్యాబ్ నే చెరుకు రసం స్టాల్ గా మార్చేశాడు. ఓ రోడ్డుపై క్యాబ్ నిలుపుకుని చెరుకు రసం అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. క్యాబ్ లు, ఆటో రిక్షాలపై కేంద్రం మే 18 నుంచే ఆంక్షలు ఎత్తివేసినా, నాగేశ్ క్యాబ్ కు చెందిన ఫిట్ నెస్ సర్టిఫికెట్ నెలకిందటే కాలం చెల్లింది. రెన్యువల్ చేయించుకుందామంటే అన్ని కార్యాలయాలు మూసివేసి ఉన్నాయి. మరోవైపు ఓలా, ఊబెర్ వంటి సంస్థలేమో వాహనానికి ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉంటేనే కాంట్రాక్టు ఇస్తామని కరాఖండీగా చెబుతున్నాయి. దీంతో క్యాబ్ నడపలేని పరిస్థితుల్లో నాగేశ్ చెరుకు రసం బాటపట్టాడు.  

వాస్తవానికి ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, వాహన పత్రాలు, అనుమతి మంజూరు పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర రిజిస్ట్రేషన్ పత్రాల కాలపరిమితిని కేంద్రం సెప్టెంబరు 30 వరకు పెంచింది. కానీ, ఓలా, ఊబెర్ వంటి సంస్థలు మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నాయని నాగేశ్ వాపోయాడు. సయ్యద్ జకీర్ అనే మరో క్యాబ్ డ్రైవర్ ఫుట్ పాత్ పై మామిడి కాయల వ్యాపారం మొదలుపెట్టాడు. మామిడి కాయల బిజినెస్ కోసం రూ.50 వేలు పెట్టుబడి పెట్టినా, వ్యాపారంలో అనుభవం లేకపోవడం నష్టాల పాల్జేసింది. నాగేశ్, జకీర్ మాత్రమే కాదు, ఇలా ఎంతోమంది లాక్ డౌన్ ప్రభావంతో ఉపాధి కోల్పోయి అష్టకష్టాలు పడుతున్నారు.

More Telugu News