Donald Trump: భర్తలు అక్కడ... భార్యలు ఇక్కడ!... హెచ్4 వీసాలపై ట్రంప్ నిర్ణయంతో అనిశ్చితి!

  • ఈ ఏడాది చివరి వరకు వీసాలు నిలిపివేయాలని ట్రంప్ ప్రకటన
  • ఇమ్మిగ్రేషన్ ప్రకటనకు కొనసాగింపుగా తాజానిర్ణయం
  • భారత్ లో చిక్కుకుపోయిన అనేకమంది మహిళలు
Trump bans visas as spouses stuck in India

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్నాళ్లుగా హెచ్1బీ వీసాదారులను ఆందోళనకు గురిచేస్తూ అనేక ప్రకటనలు చేస్తూ, చివరికి అన్నంత పనీ చేశారు. హెచ్1బీతో పాటు అనేక రకాల వీసాలను 2020 డిసెంబరు వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అమెరికాకు వచ్చేవాళ్లు చట్టబద్ధంగానే రావాలంటూ ట్రంప్ గత ఏప్రిల్ లోనే ఇమ్మిగ్రేషన్ ప్రకటనపై సంతకం చేశారు. ఇప్పుడా ప్రకటనకు అనుబంధంగా ఎల్1, హెచ్4, హెచ్2బీ, జే1 వీసాలను కూడా ఈ ఏడాది చివరివరకు నిలిపి వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.

ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల భార్యలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా, కొన్నిపనుల నిమిత్తం భారత్ వచ్చిన పలువురు హెచ్4 వీసా మహిళలు ఇక్కడే చిక్కుకుపోయారు. ట్రంప్ ప్రకటన అనుసరించి జూన్ 24 నాటికి హెచ్4 వీసా పాస్ పోర్టులపై నిర్దేశిత స్టాంప్ వేయించుకోని వారు అమెరికాలో అడుగుపెట్టేందుకు అనర్హులు.

శివానీ అనే మహిళ కనెక్టికట్ లో ఏడేళ్లుగా నివాసం ఉంటున్నారు. ఆమె భర్త ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇటీవలే ఆమె హెచ్4 వీసా పొడిగించుకున్నారు. అమెరికాను వీడి వెళ్లినప్పుడు ఆ వీసాపై స్థానిక కాన్సులేట్ అధికారులు స్టాంప్ వేయాల్సి ఉంటుంది. కాగా శివానీ ఓ పనిమీద భారత్ వచ్చారు. తిరిగి అమెరికా వెళ్లాలనుకునేంతలో ట్రంప్ ప్రకటన వెలువడడంతో ఆమె హెచ్4 వీసా చెల్లని వీసాగా మారిపోయింది. భారత్ లో అమెరికా కాన్సులేట్ కార్యాలయాలు, ఎంబసీ కరోనా వ్యాప్తి కారణంగా మూసివేసి ఉండడం ఆమె ప్రయత్నాలకు తీవ్ర విఘాతంగా మారింది. ట్రంప్ ప్రకటన సారాంశం ప్రకారం, ఇప్పుడు శివానీ డిసెంబరు 31 వరకు అమెరికాలో అడుగుపెట్టే వీల్లేకుండా పోయింది.

ఇది ఒక్క శివానీ పరిస్థితే కాదు, రాధిక అనే మహిళ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ప్రారంభంలో కోల్ కతాలో ఉన్న తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు రాధిక తన బిడ్డతో కలిసి అమెరికా నుంచి వచ్చారు. 2010 నుంచి అమెరికాలో ఉంటున్నానని, మొదట్లో ఎల్2 వీసా, ఆపై హెచ్4 వీసా పొందానని తెలిపారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగంతో సంప్రదింపులకు ఉపయోగపడే ఐ-797 ఆమోదం కూడా ఉందని వివరించారు. ఇప్పుడా పత్రాలపై స్టాంప్ వేయించుకునే వీల్లేకపోవడంతో రాధిక కూడా కోల్ కతాలోనే ఉండాల్సి వస్తోంది.

ఢిల్లీకి చెందిన అపర్ణది మరింత బాధాకరమైన అంశం. పెళ్లయిన తర్వాత భర్తతో కేవలం 18 రోజులే గడిపింది. పరిస్థితుల ప్రభావంతో భారత్ లోనే తీవ్ర ఎడబాటు అనుభవించాల్సి వస్తోంది. హైదరాబాద్ అమ్మాయి దివ్య భర్త అమెరికాలోని మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నాడు. భర్త అమెరికాలో ఉండగా, వీసాపై తాజా స్టాంప్ లేకపోవడంతో దివ్య హైదరాబాదులోని ఉండిపోయింది. స్టాంప్ వేయించుకుందామంటే ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలు మూతపడి ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భార్య,భర్తలను విడదీసే ఇలాంటి నిర్ణయాలను పునఃసమీక్షించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. హెచ్1బీ వీసాదారులపై ఆధారపడి ఉండే హెచ్4, ఎల్2 వీసాలు కలిగివున్న వారితో అమెరికాలో నిరుద్యోగం అంశం ఏ విధంగా ప్రభావితమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

More Telugu News